వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మారాడు అన్న వారికి భారీ షాక్. ఎందుకంటే.. ఆయన మారతాడని చాలా మంది వైసీపీ అభిమానులు.. దేశ, విదేశాల్లో ఉన్న వారు కూడా ఆశించారు. ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన తర్వాత. సహజంగానే ఎంతటి నాయకుడిలో అయినా మార్పు వస్తుంది. తనను తాను మార్చుకునే ప్రయత్నం చేస్తారు. ప్రజలు తన గురించి ఏమనుకుంటున్నారు? ఏం ఆశిస్తున్నారు? అనేది తెలుసుకుని ఆదిశగా అడుగులు వేస్తారు.
కానీ ఈ విషయంలో జగన్‌లో మార్పు అయితే కనిపించడం లేదు. ఆయనకు శవానికి, పెళ్లికి తేడా తెలియ డం లేదని.. ఎన్నికలకు ముందు పెద్ద ఎత్తున చర్చ సాగింది. సాధారణంగా వైఎస్ రాజశేఖరరెడ్డిని అనుకరించే జగన్.. ఆయనలాగానే ఎప్పుడూ చిరునవ్వుతో ఉండాలని కోరుకుంటారు. ఇది మంచిదే. కానీ, సమయం-సందర్భం అనేవి ఉంటాయి. వాటికి అనుగుణంగానే నాయకులు వ్యవహరించాలి. కానీ, ఎక్కడికి వెళ్లినా.. చిరునవ్వుతోనే ఉండాలన్న కాన్సెప్టునే జగన్ ఇప్పటికీ అనుసరిస్తున్నారు.
అందుకే.. ఆయనపై ట్రోల్స్ విపరీతంగా వస్తున్నాయి. తాజాగా అచ్యుతాపురం ఫార్మా సెజ్‌లో జరిగిన ఘోరం అనంతరం.. తీవ్రంగా గాయపడిన వారికి విశాఖలోని కేజీహెచ్‌లో వైద్యం అందిస్తున్నారు. వీరంతా తీవ్ర ఆవేదనలోనూ.. వారి కుటుంబాలు.. అంతకుమించిన ఆందోళనలోనూ ఉన్నాయి. ఇలాంటి సమయంలో వారిని పరామర్శించేందుకు వెళ్లిన జగన్.. ప్రవర్థించిన తీరు.. ఆయన ముఖ కవళికలు .. వివాదానికి దారితీశాయి. ఆసుపత్రి బెడ్‌పై అచేతనంగా పడిఉన్న బాధితులను ఆయన నవ్వుతూ పలకరించడమే ఈ వివాదానికి దారితీసింది.
జగన్‌కు శవానికి-పెళ్లికి తేడా తెలియడం లేదు.. అంటూ నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక, అధికా ర పార్టీ నాయకులు అయితే.. మరింత దూకుడుగా విమర్శలు చేస్తున్నారు. బాధల్లో ఉన్న వారి దగ్గరకు వెళ్లి నవ్వడం ఏంటి జగన్ అంటూ నిలదీస్తున్నారు. నవ్వుతూ పలకరించే సందర్భాలా? ఇవి.. అని కొందరు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు.. జగన్ మారడు.. మారలేడు.. అంటూ దెప్పిపొడుస్తున్నారు. సందర్భాన్ని బట్టి విషణ్ణ వదనంతో ఆయన బాధితులను పరామర్శించాల్సి ఉంది. కానీ, ఆయన మాత్రం చిరునవ్వుతో వారిని పలకరించడం.. భారీ మైనస్ అయింది.