2021 అక్టోబర్ 19న మంగళగిరిలోని తెలుగు దేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడి ఘటన యావత్ రాష్ట్రాన్ని కుదిపేసింది. ఆ దాడి వెనక వైసీపీ కీలక నేతలు ఉన్నట్టు టీడీపీ శ్రేణులు ఆరోపణలు చేశారు. వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, వైసీపీ యువ నాయకుడు దేవినేని అవినాష్, స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామ కృష్ణారెడ్డిల అనుచరలే ఈ దాడికి పాల్పడినట్లు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. అయితే అప్పట్లో వైసీపీ అధికారంలో ఉండటంతో ఈ కేసు ముందుకు సాగలేదు.
ఇక ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అధికారం చేపట్టడంతో.. టీడీపీ ఆఫీసుపై దాడి కేసు ఊపందుకుంది. పోలీసులు విచారణ వేగవంతం చేయడంతో వైసీపీ నేతలకు ఉచ్చు బిగిస్తోంది. ఈ దాడి ఘటనలో 105 మందిపై కేసు నమోదు అయ్యింది. వీరిలో ఇప్పటివరకు 25 మంది మాత్రమే విచారణకు హాజరు అయ్యారు. మిగతా వారు రాకపోవడంతో.. ఆగస్టు 21న విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు.
అయినప్పటికీ రాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో.. ఉన్నతాధికారుల సూచన మేరకు మంగళగిరి రూరల్ పోలీసులు తాజాగా 85 వైసీపీ నేతలు నోటీసులు పంపారు. అలాగే టీడీపీ ఆఫీసుపై దాడి జరిగిన రోజు వైసీపీ కేంద్ర కార్యాలయంలోని సీసీటీవీ పుటేజి సమర్పించాలని నోటీసులు ఇచ్చారు. ప్రస్తుతం సీసీటీవీ పుటేజి ఈ కేసు దర్యాప్తులో కీలకంగా మారింది. కాగా, దేవినేని అవినాష్, అప్పిరెడ్డి, నందిగాం సురేష్‌లతో సహా వైసీపీ కీలక నేతలు ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. కొందరు నేతలు నోటీసులు అందుకుండానే ఇతర రాష్ట్రాలకు మకాం మార్చడం గమనార్హం.