ఏపీలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం అతి తక్కువ ధరకే పేదల కడుపు నింపడం కోసం అన్న క్యాంటీన్లను పునఃప్రారంభించేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. తొలి విడతలో భాగంగా ఆగస్టు 15న రాష్ట్రవ్యాప్తంగా వంద క్యాంటీన్లను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్న క్యాంటీన్ల నిర్వహణకు భారీ విరాళం అందించారు.
ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ తరుపున ఏకంగా కోటి రూపాయలు ప్రకటించి గొప్ప మనసు చాటుకున్నారు. ఈ మేరకు ఉండవల్లి నివాసంలో విరాళం చెక్కును మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణకు భువనేశ్వరి స్వయంగా అందజేశారు. పేదవాడికి కూడు, గూడు, గుడ్డ అనేది ఎన్టీఆర్ నినాదమని.. గతంలో మూతబడిన అన్న క్యాంటీన్లను పేదల కోసం మళ్లీ కూటమి ప్రభుత్వం ప్రారంభించడం గొప్ప విషయమని ఈ సందర్భంగా భువనేశ్వరి కొనియాడారు.
కాగా, రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 203 క్యాంటీన్లు కాగా.. ప్రస్తుతం 180 రెడీ అయ్యాయి. అయితే తొలి విడతలో వంద అన్న కాంటీన్లను ప్రారంభిస్తున్నారు. కృష్ణా జిల్లా గుడివాడలో సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా నేడు తొలి అన్న క్యాంటీన్ ఓపెన్ కాబోతోంది. ఇందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఇక మిగిలిన 99 క్యాంటీన్లను మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు ప్రారంభిస్తారు. ఆదివారం మినహా వారంలో ఆరు రోజులు అన్న క్యాంటీన్లు నడుస్తాయి. ఈ క్యాంటీన్ల ద్వారా రూ. 5 కే ఉదయం టిఫిన్, మధ్యాహ్నం లంచ్, రాత్రికి డిన్నర్ అందిస్తారు.