టెక్కలి వైకాపా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి రచ్చ రోడెక్కడం కాదు ఏకంగా రాష్ట్రంలోనే హాట్ టాపిక్ గా మారింది. ఓ వైపు సతీమణి వాణి.. మరోవైపు దివ్వెల మాధురీ.. మధ్యలో దువ్వాడ శ్రీనివాస్.. వారం రోజుల నుంచి ఈ ముగ్గురూ చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. అటు ప్రధాన మీడియా ఇటు సోషల్ మీడియా ఎక్కడ చూసినా దువ్వాడ కుటుంబ కథా చిత్రంపైనే చర్చలు సాగుతున్నాయి. ట్విస్టుల మీద ట్విస్టులతో వీరి ఫ్యామిలీ ఫైట్ కంటిన్యూ అవుతోంది.
తన తప్పేమీ లేదని.. తన భార్య వాణితో ఏమాత్రం పడట్లేదని.. ఆమెకు విడాకులు ఇస్తున్నానని దువ్వాడ శ్రీనివాస్ ఇప్పటికే మీడియాతో వెల్లడించారు. భార్య, పిల్లలు తనను సరిగ్గా చూడట్లేదని.. ఇంట్లోకి రానివ్వకపోవడంతో దిక్కుతోచని స్థితిలో మరొక స్త్రీకి దగ్గరైన మాట వాస్తవమేనని దువ్వాడ పేర్కొన్నారు. పైగా ఇద్దరు వ్యక్తులు ఇష్టపూర్వకంగా సహజీవనం చేయడం లీగల్ అని సుప్రీంకోర్టునే చెప్పిందని దువ్వాడ తనను సమర్థించుకున్నారు.
అయితే ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లుపై గతంలో చేసిన కామెంట్స్ గురించి మీడియా దువ్వాడను ప్రశ్నించింది. అందుకు బదులిస్తూ.. తాను పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల గురించి తెలియక తప్పుగా మాట్లాడాను..పాపం ఆయనకు ఎన్ని సమస్యలు వచ్చాయో.. ఇప్పుడు తన దాకా వస్తే కానీ తెలియలేదని దువ్వాడ కొత్త స్వరం అందుకున్నారు. రాజకీయాల్లో భాగంగా ఎన్నో మాట్లాడతామని.. అవన్నీ నిజం కాదని ఆయన చెప్పుకొచ్చారు.
కాగా, వైకాపా హయాంలో ఒకానొక సందర్భంలో దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడుతూ.. `ఓ తెలుగువాడిగా ఏకపత్నీవ్రతం మన మతం. ఒక స్త్రీనే పెళ్లాడి.. ఆ స్త్రీతోనే జీవితం పూర్తిచేయడం మన సంప్రదాయం. అటువంటి సంప్రదాయానికి తూట్లు పొడిచిన నీచుడు పవన్‌కల్యాణ్` అంటూ విమర్శించారు. కానీ ఇప్పుడు మాట మార్చడంతో దువ్వాడ తీరు పట్ల అధికార పార్టీ నేతలు మండిపడుతున్నారు.