ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గత నెలలో తన భద్రతపై కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఎన్నికల తర్వాత ప్రభుత్వం ఏకపక్షంగా తన సెక్యూరిటీని తొలగించిందని.. ప్రాణహాని ఉన్నందున ముఖ్యమంత్రి హోదాలో తనకు కల్పించిన సెక్యూరిటీని పునరుద్ధరించాలంటూ హైకోర్ట్‌లో ఆయన పిటిషన్ దాఖలు చేశారు.
అయితే నేడు జగన్ వేసిన పిటిషన్ ను ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన నెల రోజుల్లోనే ఎటువంటి సమాచారం ఇవ్వకుండా జగన్ కు జడ్ ప్లస్‌గా ఉన్న భద్రతను తగ్గించారని.. గతంలో 139 మంది భద్రతా సిబ్బంది ఉండగా.. దాన్ని 59కి కుదించారని, దీన్ని పునరుద్ధరించాలని జగన్ తరఫున లాయర్లు వాదనలు వినిపించారు. అలాగే జగన్ కు కేటాయించిన వాహనం తరచూ మరమ్మతులకు గురవుతోందని కూడా తెలిపారు.
వాదనలు విన్న హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. జగన్ మాజీ సీఎం అని.. ఆయన భద్రత ప్రభుత్వం బాధ్యత అని ధర్మాసనం పేర్కొంది. జగన్ భద్రత విషయంలో ఎలాంటి రాజీ పడొద్దని.. జగన్‌కు మరో బుల్లెట్ ప్రూఫ్ వాహనం కేటాయించాలని ఆదేశించింది. జామర్ ఏర్పాటుపై స్పష్టత ఇవ్వాలని న్యాయస్థానం కోరగా.. అందుకు రాష్ట్ర ప్రభుత్వం జగన్‌కు జామర్ వెహికల్స్‌ను కూడా కేటాయిస్తామని తెలిపింది. ఇక పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేస్తూ.. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.