ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పదేపదే బెంగళూరుకు వెళ్తుండటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ చారిత్రాత్మక పరాజయాన్ని మూట కట్టుకున్న తర్వాత జగన్ బెంగళూరులోనే ఎక్కువగా గడుపుతున్నారు. శుక్రవారం జగన్ మరోసారి బెంగళూరు బయలుదేరి వెళ్లారు.. 40 రోజుల వ్యవధిలో ఆయన బెంగళూరుకు వెళ్లడం ఇది నాలుగోసారి.
గత మంగళవారమే బెంగళూరు నుంచి జగన్ తాడేపల్లి వచ్చారు. ఇప్పట్లో ఆయన తిరిగి వెళ్లరని వైసీపీ నేతలు భావించారు. గతంలో ప్లాన్ చేసిన ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తారని అంతా అనుకున్నారు. కానీ వారం తిరక్క ముందే మళ్ళీ ఆయన బెంగళూరు వెళ్లిపోయి పార్టీ శ్రేణులను ఆశ్చర్యానికి గురి చేశారు.
ఈ నెల 5న లేదా 6న మాజీ సీఎం తిరిగి తాడేపల్లి రానున్నారని తెలుస్తోంది. అయితే పదే పదే బెంగళూరు వెళ్లడం వెనక జగన్ ఎజెండా ఏంటో ఎవరికీ అర్థం కావడం లేదు. కానీ కచ్చితంగా ఏదో మతలబు ఉందని వైసీపీ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. పక్కా ప్రణాలికతోనే జగన్ తాడేపల్లి టూ బెంగళూరు అంటూ వరుస పర్యటనలు చేస్తున్నారని అంటున్నారు. కాగా, రాష్ట్రంలో ఇప్పటివరకూ రెండుసార్లు అసెంబ్లీ సమావేశాలు జరగగా.. కేవలం తొలిరోజు మాత్రమే జగన్ హాజరై వెళ్లిపోయారు. ఈ మధ్యలో ఢిల్లీ వెళ్లి రాష్ట్రంలో శాంతి భద్రతల అంశంపై ధర్నా అంటూ హడావుడి చేసినా.. అది అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు.