వర్గీకరణపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చిన వేళ.. టైమ్లీగా స్పందించారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎస్పీ వర్గీకరణ కోసం మాదిగ.. మాదిగ ఉప కులాల యువకులు 27 ఏళ్లుగా చేస్తున్న పోరును తాము సైతం గుర్తించినట్లుగా వ్యవహరించింది రేవంత్ సర్కారు. సుప్రీం తీర్పు వేళ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లలోనూ వర్గీకరణ అమలుకు చర్యలు చేపట్టనున్నట్లుగా ప్రకటించారు. తెలంగాణ అసెంబ్లీలో ఆయనీ ప్రకటన చేశారు. అదే సమయంలో తన రాజకీయ ప్రత్యర్థి.. విపక్ష బీఆర్ఎస్ పైనా ఘాటు విమర్శలు చేశారు. వర్గీకరణ విషయంలో వారి పాత్ర ఏమీ లేదన్న విషయాన్ని చెప్పే ప్రయత్నం చేయటం గమనార్హం.
ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వర్గీకరణ కోసం గతంలో ఇదే అసెంబ్లీలో వాయిదా తీర్మానాన్ని ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ.. ‘‘వర్గీకరణకు వాయిదా తీర్మానాన్ని ఇస్తే.. నాతో పాటు సంపత్ కుమార్ ను ఇదే సభ నుంచి బహిష్కరించారు. గత ప్రభుత్వం ఏబీసీడీ వర్గీకరణ అంశంపై ప్రధాని నరేంద్ర మోడీ వద్దకు తీసుకెళతామని చెప్పింది. అలా తీసుకెళ్లకుండా మాదిగ సోదరులను మోసం చేశారు. మేం ప్రజా ప్రభుత్వ బాధ్యత తీసుకున్న తర్వాత ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సూచన మేరకు మంత్రి దామోదర రాజనర్సింహ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు.. అడ్వొకేట్ జనరల్ ను ఢిల్లీకి పంపాం. న్యాయవాదులతో చర్చించి వర్గీకరణపై సుప్రీంకోర్టులో బలమైన వాదనను కాంగ్రెస్ వినిపించింది’’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
మాదిగ.. మాదిగ ఉప కులాల వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో దేశ అత్యున్నత న్యాయస్థానానికి తాము థ్యాంక్స్ చెబుతున్నట్లుగా పేర్కొన్నారు. దేశంలో అందరికంటే ముందు భాగాన నిలబడి ఏబీసీడీ వర్గీకరణ చేసే బాధ్యత తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. ‘‘ఇప్పుడు ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లలోనూ వర్గీకరణను అమలు చేస్తాం. దీనికి అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొచ్చి మాదిగ సోదరులకు న్యాయం చేస్తాం. మాదిగ, మాదిగ ఉపకులాల వర్గీకరణకు సంపూర్ణంగా సహరించాల్సిందిగా రాష్ట్రప్రభుత్వం తరఫును విజ్ఖప్తి చేస్తున్నా’’అని ముఖ్యమంత్రి రేవంత్ కోరారు. మొత్తంగా తనకు అందివచ్చిన అవకాశాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవటం రేవంత్ లో కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది.