ఏపీ రాజకీయాల్లో ఓ సంచలన పరిణామం చోటుచేసుకుంది. టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తాజాగా దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి, వైకాపా అధినేత వైఎస్ జగన్ తల్లి వైఎస్ విజయలక్ష్మితో భేటీ అయ్యారు. హైదరాబాద్లోని లోటస్పాండ్లో ఉన్న విజయమ్మ ఇంటికి ఈరోజు జేసీ ప్రభాకర్ వెళ్లారు. విజయమ్మను ఆప్యాయంగా పలకరించి.. యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
దాదాపు అరగంట పాటు ఇద్దర మధ్య పలు అంశాలపై చర్చలు సాగినట్లు తెలుస్తోంది. అయితే ఈ భేటీలో ఎటువంటి రాజకీయాలు లేవని.. విజయమ్మ ఆరోగ్యం బాగాలేదన్న సమాచారంతోనే ఆమెను పలకరించేందుకు వెళ్లారని జేసీ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఇక విజయమ్మను కలవడంపై జేపీ ప్రభాకర్ రెడ్డి ఇంత వరకు స్పందించలేదు. దీంతో ఏవేవో ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి..
కాగా, వైఎస్ ఫ్యామిలీకి, జేసీ కుటుంబానికి మధ్య సన్నిహిత సంబంధాలు ఉండేవి. వైఎస్ హయాంలో జేసీ ప్రభాకర్ రెడ్డి రెండు దశాబ్దాలకుపైగా కాంగ్రెస్లో ఉన్నారు. ఈ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలోనే జేసీ దివాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి కుటుంబాలు తెలుగు దేశం పార్టీలో చేరాయి. వైఎస్ జగన్ అధికారికంలోకి వచ్చిన తర్వాత జేసీ బ్రదర్స్ ను గట్టిగా టార్గెట్ చేశారు. జేసీ బ్రదర్స్, జేసీ ట్రావెల్స్ పై కేసులు పెట్టి తీవ్రంగా వేధించారు. ఇక వైఎస్ జగన్ అంటే అస్సలు పడని జేసీ ప్రభాకర్ రెడ్డి ఇప్పుడు విజయమ్మను కలవడం హాట్ టాపిక్ గా మారింది.