ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలలో ఒక ఆసక్తికర సన్నివేశం కనిపించింది. సభ జరుగుతున్న సంధర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ‘‘వైఎస్ జగన్ పాలనలో అక్రమ కేసులు ఎదుర్కొన్న ఎమ్మెల్యేలు ఎంత మంది ఉన్నారు. ఒక సారి లేచి నిలబడండి’’ అని అన్నారు. దీంతో సభలో ఉన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ సహా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు 80 శాతం పైగా లేచి నిలబడ్డారు.
‘‘మరి కేసుల్లేని పుణ్యాత్ములు, అదృష్టవంతులు ఒకసారి లేచి నిలబడాలి’’ అని చంద్రబాబు కోరగా సభలో ఉన్న 10 నుండి 20 శాతం మంది ఎమ్మెల్యేలు లేచి నిలబడ్డారు. జగన్ హయాంలో మంత్రి నారాయణతో పాటు, ఆయన సతీమణి, కుమార్తెలు, అల్లుళ్లను కూడా విచారించారని, గత పాలనపై రాజకీయ పోరాటం చేసిన మనమంతా బాధితులమేనని చంద్రబాబు అన్నారు.
”ఈ శాసనసభలో నాకు జరిగిన అవమానాన్ని, అన్యాయాన్ని జీవితంలో మర్చిపోలేను. నా జీవితంలో తొలిసారి కంటతడి పెట్టాను. పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేశారు. జగన్ కు బుద్ధి రావాలని నేనూ ఒక మాట అన్నా. పవన్ కల్యాణ్ చట్టపరంగా పెళ్లి చేసుకున్నారు. ఇన్ని సార్లు కలవరిస్తున్నావ్. నువ్వు కూడా వెళ్లి ఒకసారి పవన్ తో కాపురం చేయమని జగన్ కు చెప్పాను. మహిళల మనోభావాలను కించపరిచేలా ఎవరూ మాట్లాడొద్దు. మహిళలను కించపరిచే వాళ్లను వదిలిపెట్టను. పబ్లిక్ లో నిలబెడతాను. ఆ విషయంలో రాజీపడను’’ అని చంద్రబాబు స్పష్టం చేశారు.