వ్యవస్థలో మార్పులు రావాలంటే మాటలు చెబుతూ కూర్చుంటే సరిపోదు. పాదరసంలా వేగంగా స్పందించాలి. ఏళ్ల తరబడి ఉండిపోయి.. కాలం చెల్లిన విధానాల్ని వదిలించుకోవాల్సి ఉంటుంది. అంతేకాదు వివాదాల్ని సరైన సమయంలో సరైన పద్ధతుల్లో పరిష్కరించాల్సిన అవసరం ఉంది. ఈ విషయాన్ని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గుర్తించారు. ఏసీబీ చేతికి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన వారిపై చర్యలు తీసుకోవటానికి ఏళ్లకు ఏళ్లు పెండింగ్ పెట్టటం.. సస్పెన్షన్ వేటు పడి.. ప్రభుత్వం నుంచి సగం జీతాన్ని తీసుకోవటం లాంటి ఉదంతాలు చాలానే కనిపిస్తాయి.
ఈ తీరును పూర్తిగా మార్చేసేలా ఏపీ సర్కారు సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ కేసుల్లో ప్రభుత్వ ఉద్యోగులపై వంద రోజుల్లో విచారణ పూర్తి చేసి క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని జగన్ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. ఒకవేళ.. ప్రభుత్వం చెప్పిన వంద రోజుల్లో క్రమశిక్షణ చర్యలు తీసుకోవటంలో ఫెయిల్ అయితే.. అందుకు కారణమైన సిబ్బంది.. అధికారుల్ని బాధ్యులుగా చేసి చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.
దీనికి సంబంధించిన ఉత్తర్వులు తాజాగా జారీ చేశారు.ఆదివారం రాత్రి ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ కీలక ఉత్తర్వుల్ని జారీ చేశారు. సెలవు రోజు అన్నది చూడకుండా.. తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు షాకింగ్ గా మారింది. ఇప్పటివరకు ఉన్న విధానం ప్రకారం ఏసీబీ కేసుల్లో రెడ్ హ్యాండెడ్ గా దొరికిన వారిని విచారణ పేరుతో ఏళ్లకు ఏళ్లుగా పెండింగ్ లో ఉంచేస్తున్నారు. ఇలాంటి తీరుకు గుడ్ బై చెప్పేస్తూ కొత్త విధానాన్ని తెర మీదకు తీసుకొచ్చారు. తాజాగా ఏర్పాటు చేసిన కమిటీ.. ఏసీబీ కేసుల్లో పట్టుబడిన వారి వ్యవహారాల్ని సమీక్షిస్తుంది. వారి సిఫార్సుల ఆధారంగా వంద రోజుల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది.