కుదురుగా ఉండే జీవితాన్ని చిన్నాభిన్నం చేసుకోవటం కొంతమందిలో కనిపిస్తుంది. ఇప్పుడు ఓ భార్య గురించి చెప్పే ఉదంతం ఆ కోవకు చెందిందే. ఇప్పుడు చెప్పే ఉదంతం గురించి చదివినప్పుడు ఒక పట్టాన నమ్మశక్యంగా అనిపించదు. అంతేకాదు.. ఇలా కూడా చేస్తారా? అన్న భావన కలుగుతుంది. రీల్ స్టోరీకి తీసిపోని ఈ రియల్ స్టోరీలోకి వెళితే..
ఒక ఐఏఎస్ అధికారి సతీమణి.. తన స్నేహితుడి మీద మోజుతో చేసిన పని గురించి తెలిస్తే నోట మాట రాదు. తమిళనాడుకు చెందిన ఐఏఎస్ అధికారి గుజరాత్ క్యాడర్ లో పని చేస్తున్నారు. గుజరాత్ లోని ఒక ప్రభుత్వ సంస్థలో రాష్ట్రస్థాయి కమిషన్ కార్యదర్శిగా పని చేస్తున్నారు. అతడి భార్య 45 ఏళ్ల జె. సురియ. అయితే.. ఆమెకు ఒక పాత స్నేహితుడు (రాజు) ఉన్నాడు. అతడో గ్యాంగ్ స్టర్. తమిళనాడుకు చెందిన అతడితో ఎనిమిది నెలల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయింది.
ఇద్దరు పిల్లల తల్లి అయిన ఆమె.. భర్త దగ్గర వదిలేసి.. తన దారిన తాను వెళ్లిపోయింది. అయితే.. గ్యాంగ్ స్టర్ రాజుతో కలిసిన ఆమో తాజాగా తమిళనాడులోని ఒక బాలుడ్ని కిడ్నాప్ కు ప్రయత్నించినట్లుగా కేసు నమోదైంది. బాలుడ్ని రెస్క్యూ చేసిన తమిళనాడు పోలీసులు.. దీనికి కారణమైన రాజా.. సురియల కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో గత శనివారం ఆమె గాంధీ నగర్ లోని తన భర్త వద్దకు తిరిగి వచ్చారు. అయితే.. ఆమెను సదరు ఐఏఎస్ అధికారి భద్రతా సిబ్బంది ఇంట్లోకి రానివ్వలేదు.
దీంతో.. ఆమె తీవ్ర మనస్తాపానికి గురై.. విషయం తాగింది. స్థానిక ఆసుపత్రిలో చేర్చినా ఫలితం లేకపోయింది. ఆమె మరణంపై సదరు అధికారి తరఫు లాయర్ మీడియాతో మాట్లాడారు. సదరు ఐఏఎస్ అధికారి దంపతులు ఇద్దరు ఏడాదిగా విడిగా ఉంటున్నట్లుగా పేర్కొన్నారు. విడాకుల కోసం కూడా దరఖాస్తు చేసినట్లుగా పేర్కొన్నారు. తనను డబ్బల కోసం తన స్నేహితుడు ట్రాప్ చేసినట్లుగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ రాసిన లేఖలో పేర్కొన్నట్లుగా చెబుతున్నారు.
భర్తకు సారీ చెప్పేందుకు వస్తే.. ఆయన అనుమతించకపోవటంతో సూసైడ్ చేసుకుంటున్నట్లుగా లేఖలో పేర్కొన్నట్లు చెబుతున్నారు. దిద్దుకోలేని తప్పులు చేయటం ఎందుకు? బలవన్మరణాలకు పాల్పడటంలో అర్థం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.