ఎన్డీఏ పాలనలో వైసీపీ నేతల హత్యలు, వైసీపీ నేతలపై దాడులు పెరిగిపోయాయని ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోన ఆ దాడులపై రాష్ట్రపతి స్పందించాలని, రాష్ట్రపతి పాలన విధించాలని జగన్ డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే జగన్ నేడు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలవనున్నారు.
ఈ క్రమంలోనే ఈ వ్యవహారంపై ఏపీ హోం మంత్రి అనిత స్పందించారు. టీడీపీ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం జగన్ చేస్తున్నారని అనిత ఆరోపించారు. అబద్ధపు ప్రచారాలకు తెరలేపినందుకు జగన్ పై చర్యలు ఎందుకు తీసుకోకూడదని ప్రశ్నించారు. జగన్ చేసిన ఆరోపణలపై అనిత మండిపడ్డారు. తమ ప్రభుత్వం ఏర్పడ్డాక ఇప్పటి వరకు రాష్ట్రంలో నాలుగు రాజకీయ హత్యలు జరిగాయని, వారిలో ముగ్గురు టీడీపీ కార్యకర్తలు, నాయకులు అని గుర్తు చేశారు.
కానీ, జగన్ మాత్రం అసత్యాలు ప్రచారం చేస్తున్నారని అనిత అన్నారు. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 36 హత్యలు జరిగాయని జగన్ చెబుతున్నారని, ఆ వివరాలిస్తే పోలీసులతో సమగ్ర విచారణ జరిపిస్తామని చెప్పారు. అంతేగానీ, ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడానికి తప్పుడు ఆరోపణలు చేస్తే జగన్ పై చర్యలు ఎందుకు తీసుకోకూడదని ప్రశ్నించారు. జనం తన మాటలు ఇంకా నమ్ముతారని జగన్ భావించడం హాస్యాస్పదమని అనిత కొట్టిపారేశారు.