వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతల్లో ఒకరైన విజయసాయి రెడ్డి పేరు కొన్ని రోజులుగా మీడియాలో చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే. దేవాదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్‌గా పని చేసిన శాంతి అనే మహిళతో ఆయన బంధం మీద రకరకాల ఆరోపణలు వచ్చాయి. స్వయంగా శాంతి భర్తే.. తన బిడ్డకు తాను తండ్రి కాదని, విజయసాయే తండ్రి కావచ్చని సందేహం వ్యక్తం చేస్తూ దేవాదాయ శాఖ ఉన్నతాధికారులకు లేఖ రాయడం సంచనలం రేపింది.
ఐతే విజయసాయి ఈ విషయమై ప్రెస్ మీట్ పెట్టి తీవ్రంగా ఖండించారు. మరోవైపు సుభాష్ రెడ్డి అనే అడ్వకేట్‌తో శాంతి బంధానికి సంబంధించి ఫొటోలు కొన్ని తాజాగా బయటికి రావడం చూస్తే ఆయనతోనే ఆమె బిడ్డను కని ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యక్తిగత విషయాల గురించి చర్చను పక్కన పెడితే.. విజయసాయికి శాంతి బినామీ అనే చర్చ ఇప్పుడు ఊపందుకుంది.
శాంతికి వ్యతిరేకంగా ప్రెస్ మీట్ పెట్టిన సందర్భంగా ఆమె భర్త మదన్ మోహన్ కొన్ని సంచలన విషయాలు వెల్లడించాడు. విజయవాడలో నాలుగు కోట్ల విలువైన విల్లాను విజయసాయిరెడ్డి తన భార్యకు రూ.2.5 కోట్లకే ఇప్పించాడని.. పైగా ఆయన్నుంచి రూ.1.6 కోట్ల ఆర్థిక సాయం అందిందని వెల్లడించాడు. వైజాగ్‌లోని ప్రేమ సమాజం భూములకు సంబంధించి చేసిన సాయాన్ని గుర్తుంచుకునే ఆయన ఈ ప్రతి సాయం చేసినట్లు ఆయన వెల్లడించారు. దీంతో ఈ వ్యవహారం మీద లోతుగా విచారణ జరపాలంటూ జనసేన నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం.
విశాఖలో శాంతిని బినామీగా పెట్టుకుని, ఆమె అధికారాన్ని వాడి దేవాదాయ శాఖ భూములు చాలానే విజయసాయి దోచేశాడని.. అందులో కొన్ని శాంతి పేరు మీద కూడా రిజిస్టర్ చేయించారని.. ఆమె ఆయనకు బినామీగా వ్యవహరించిందని.. వ్యక్తిగత విషయాలను పక్కన పెట్టి ఈ అక్రమాలపై విచారణ జరపాలని జనసేన నేతలు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.