దేశంలో అత్యంత సంపన్న వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ ఇటీవల వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. తన ప్రియసఖి రాధికా మర్చంట్ ను అనంత్ అంబానీ పెళ్లి చేసుకోవడం జరిగింది. ప్రపంచమంతా తొంగి చూసేలా వీరి పరిణయ మహోత్సహం జరిగింది. గత ఏడు నెలల నుంచి అంబానీ ఇంట సాగుతున్న పెళ్లి వేడుకలు ఆదివారం జరిగిన మంగల్ ఉత్సవ్ కార్యక్రమంతో పూర్తయ్యాయి.
అనంత్ అంబానీ-రాధికా వివాహానికి దేశ విదేశాల నుంచి సినీ, రాజకీయ, వ్యాపార, క్రీడా తదితర రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. ముఖ్యంగా ఇండియన్ ఫిల్మ్ స్టార్స్ తో పాటు హాలీవుడ్ నటీనటులతో అంబానీ పెళ్లి వేడుక కళకళాడిపోయింది. అయితే తాజాగా బాలీవుడ్ బ్యూటీ తాప్సీ పన్ను అంబానీ పెళ్లిలో సినీ తారలు సందడి చేయడం పట్ల సెటైర్లు పేల్చింది.
ఓ ఇంటర్వ్యూలో పాల్గొన తాప్సీకి `అనంత్-రాధికా పెళ్లికి ఎందుకు హాజరు కాలేదు?` అనే ప్రశ్న ఎదురైంది. అయితే అందుకు తాప్సీ బదులిస్తూ.. `నిజం చెప్పాలంటే అంబానీ ఫ్యామిలీలో నాకు పర్సనల్ గా ఎవరూ తెలియదు. పెళ్లి అనేది ఎన్నో అనుబంధాలతో కూడుకుని ఉంటుంది. ఆతిథ్యం ఇచ్చే కుటుంబానికి, అతిథికి మధ్య కనీసం ఏదో ఒక రకమైన అనుబంధం ఉండాలని నేను భావిస్తాను. అలా ఉంటేనే నేను వివాహాలకు హాజరవుతాను` అని చెప్పుకొచ్చింది.
కాగా, పెళ్లికి వెళ్లిన స్టార్స్ లో చాలా మందికి అంబాని కుటుంబంతో పర్శనల్ అనుబంధం లేదు అన్నది ఓపెన్ సీక్రెట్. అయినప్పటికీ వాళ్లు పిలిచారు.. వీళ్లు వెళ్లారు. ఫోటోలు దిగడమే కాకుండా కొందరు తారలు డ్యాన్సులు కూడా చేసి తెగ హంగామా చేశారు. కారణం అక్కడ ఉన్నది అపర కుబేరుడు ముఖేష్ అంబానీ. ఈ విషయంపైనే తాప్సీ తన స్టేట్మెంట్ తో సినీ తారలపై సెటైర్లు పేల్చింది. తాను డబ్బు కన్నా బంధాలకు ఎక్కువ ప్రధాన్యత ఇస్తానని తాప్సీ చెప్పకనే చెప్పేసింది. దీంతో తాజాగా ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.