ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అంటే ఈ తరం యువకుల నుంచి ఆ తరం పెద్ద వయసు వారి వరకు అందరికీ గౌరవమే. విజన్ ఉన్న నాయకుడిగా, ఆంధ్రప్రదేశ్ పేరు ప్రపంచ పటంలో వెలిగిపోయేలా చేయడంలో చంద్రబాబు విజనరీ నిర్ణయాలు ఎంత దోహదపడ్డాయో ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు. అందుకే, చంద్రబాబును దగ్గరగా కలిసే అవకాశం వస్తే పార్టీ కార్యకర్తలు, నేతలు, అభిమానులు ఏ మాత్రం ఆలోచించకుండా ఆయన కాళ్లకు దండం పెట్టి ఆశీర్వదించమని కోరుతుంటారు. వయసులో పెద్దవారు, గౌరవనీయ ముఖ్యమంత్రి, తమ ఆరాధ్య నాయకుడు అనే పూజ్యభావంతో చాలామంది ఆయనకు కాళ్లకు దండం పెటడుతుంటారు. అయితే, ఈ విషయంపై తాజాగా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇకపై ప్రజలు, పార్టీ కార్యకర్తలు, నేతలు తన కాళ్లకు నమస్కరించే పని చేయవద్దని చంద్రబాబు సున్నితంగా వారించారు. కాళ్లకు నమస్కారం పెట్టించుకునే సంస్కృతి మంచిది కాదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.
తాను ఎంత వారిస్తున్నా ప్రజలు, కార్యకర్తలు, నాయకులు తన కాళ్లకు నమస్కరిస్తున్నారని, ఇకపై అలా చేయవద్దని విజ్ఞప్తి చేశారు. తల్లిదండ్రులు, గురువులు, దైవం…వారి కాళ్లకు మాత్రమే మొక్కాలని…. నాయకులకు కాదని చంద్రబాబు చెప్పారు. అంతేకాదు, రాజకీయ నాయకులు కూడా ఈ సంస్కృతికి దూరంగా ఉండాలని సూచించారు.
తాను ఇంత చెప్పినా, ఇలా వారించినా వినకుండా ఎవరైనా తన కాళ్లకు మొక్కితే….తిరిగి తాను కూడా వాళ్ల కాళ్లకు మొక్కుతానని చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన సూచనను, విజ్ఞప్తిని అందరూ అర్థం చేసుకుని సహకరించాలని చంద్రబాబు కోరారు. ప్రతి ఒక్కరూ ఆత్మగౌరవంతో నడుచుకోవాలని, కాళ్లకు మొక్కే సంస్కృతి మంచి విధానం కాదని అభిప్రాయపడ్డారు. ఇవాళ్టి నుంచి ఈ విధానానికి స్వప్తి పలుకుదామని అందరికీ పిలుపునిచ్చారు.