ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ తన చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహాన్ని అనంత తరాలు గుర్తుండిపోయేలా చేస్తున్నారు. ఎంగేజ్మెంట్, ఎంగేజ్మెంట్ పార్టీ, ప్రీ వెడ్డింగ్ పార్టీ, యూరోపియన్ క్రూయిజ్ పార్టీ, మ్యూజిక్ నైట్, హల్దీ వంటి కార్యక్రమాలతో దాదాపు ఏడు నెలల నుంచి సాగుతున్న అనంత్ అంబానీ-రాధికా మార్చంట్ల వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఇప్పుడు ముగింపు దశకు చేరుకున్నాయి.
జులై 12న ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో అనంత్-రాధికల పరిణయం అంగరంగ వైభవంగా జరిగింది. హిందూ సంప్రదాయం ప్రకారం మూడుముళ్ళ బంధంతో ఈ జంట ఒకటైంది. వీరి వివాహానికి దేశ విదేశాల నుంచి అతిథులు విచ్చేసి హంగామా చేశారు. అలాగే ఈ రోజు వివాహ ఘట్టంలోని చివరి దశ జరగబోతోంది. శుభ్ ఆశీర్వాద్గా పిలిచే దైవిక ఆశీర్వాద వేడుకను నిర్వహించబోతున్నారు.
అయితే ఇవాళ జరిగే కార్యక్రమాల్లో తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొనబోతున్నారు. అంబానీ ఇంటి అంబరాన్ని అంటేలా సాగుతున్న పెళ్లి వేడుకల్లో ఆయన కూడా భాగం అవుతున్నారు. శనివారం సాయంత్రం 4:30 గంటలకు గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో చంద్రబాబు ముంబైకి వెళ్ళనున్నారు. అనంత్ అంబానీ వివాహానికి హాజరై.. ఈ రాత్రికి ముంబైలోనే బస చేయనున్నారు. ఆదివారం మధ్యాహ్నం ఉండవల్లి నివాసానికి చంద్రబాబు తిరిగి చేరుకోనున్నారు. ఇందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.