ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు భారీ ఊరట లభించింది. ప్రస్తుతం జైల్లో ఉన్న ఆయనకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసింది. ఢిల్లీలో తీసుకువచ్చిన నూతన మద్యం విధానంలో మనీలాండరింగ్ జరిగినట్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రమేయం ఉందంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న కేజ్రీవాల్‌ను ఈ ఏడాది మార్చి 21న అధికారులు అరెస్టు చేశారు. దీంతో ప్రస్తుతం ఆయన జైల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ రోజు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
అయితే.. మరోవైపు తన అరెస్టును సవాల్ చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది. ఇక, ఇప్పుడు… ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు బెయిల్ లభించినా సీబీఐ నమోదుచేసిన మరో కేసులో ఆయన తిహాడ్ జైల్లోనే ఉండనున్నారు. కేసు పూర్వాపరాలను గమనిస్తే.. ఢిల్లీలో వెలుగు చూసిన మద్యం కుంభకోణం కేసులో ఏప్రిల్ 9న ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఈడీ, ముఖ్యమంత్రి న్యాయవాదుల తరఫు వాదనలు విన్న సర్వోన్నత న్యాయస్థానంలోని ద్విసభ్య ధర్మాసనం మే 17న తీర్పును రిజర్వ్ చేసింది.
తాజాగా ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు వెలువరించింది. ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ముఖ్యమంత్రి బాధ్యతల నుంచి వైదొలిగే విషయంలో కోర్టు ఎలాంటి ఆదేశాలివ్వబోమని తెలిపింది. ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధిగా ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారని, అరెస్టు చేశారు కాబట్టి ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవాలా లేదా అన్న నిర్ణయం ఆయనదేనని కోర్టు వెల్లడించింది. ఇక, కేజ్రీవాల్ అరెస్టు వ్యవహారంలో ఈడీ అధికారాలు, మద్యం పాలసీపైనా కోర్టు కొన్ని ప్రశ్నలు సంధించింది.