ఏపీకి తలమానికమైన విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించబోతున్నారని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఏపీలో పర్యటిస్తున్న కేంద్ర మంత్రి కుమారస్వామి విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణపై కీలక ప్రకటన చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను లోని పలు విభాగాలను సందర్శించిన కుమార స్వామి….స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు అవకాశం లేదని తేల్చి చెప్పారు. త్వరలోనే ఈ పరిశ్రమంలో 100% సామర్ధ్యంతో ఉత్పత్తి జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమకు సంబంధించిన ఏ అంశంపై అయినా తాను ప్రధాని మోడీ దృష్టికి తీసుకువెళ్లిన తర్వాతే తుది నిర్ణయం ప్రకటించగలనని కుమారస్వామి చెప్పారు.
విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ లేదని తేల్చి చెప్పిన కుమార స్వామికి మంత్రి నారా లోకేష్ ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేశారు. కుమార స్వామి ప్రకటనతో బ్లూ మీడియాకు షాక్ తగిలిందని లోకేష్ అన్నారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం చొరవతో విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకుంటామని లోకేష్ చెప్పారు.
అంతకుముందు, విశాఖ స్టీల్ ప్లాంట్ లో పలు విభాగాలు సందర్శించిన కుమార స్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఉక్కు ఫ్యాక్టరీ మూతపడే ప్రసక్తే లేదని అక్కడి విజిటర్స్ బుక్ లో స్పష్టంగా ఆ విషయాన్ని కుమార స్వామి స్వహస్తాలతో రాశారు. దీంతో, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ దుష్ప్రచారానికి తెరపడినట్లయింది. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ జరుగుతుందని ఎవరు చెప్పారు అంటూ మీడియా ప్రతినిధులను కుమారస్వామి ఎదురు ప్రశ్నించారు. ఈ విషయంపై తాను ప్రధానికి నోట్ సమర్పిస్తానని, ప్రధాని ఆశీస్సులతో మళ్ళీ విశాఖ ఉక్కు పరిశ్రమ పునరుద్ధరణ జరుగుతుందని కుమార స్వామి అన్నారు.
ఇక, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ఏపీ సీఎం చంద్రబాబు మండిపడ్డారు. అటువంటి దుష్ప్రచారాలు నమ్మొద్దని ప్రజలకు సూచించారు. తెలుగు వారి ఆత్మగౌరవం కోసం పుట్టిన విశాఖ స్టీల్ ప్లాంట్ ను ఎలా కాపాడుకోవాలన్న విషయంపై ఆలోచిస్తున్నామని, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని సాధించుకున్న ఫ్యాక్టరీని వదులుకునే ప్రసక్తే లేదని చెప్పారు.