ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా విశాఖలో పర్యటించారు. ఈ సందర్భంగా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. 2026 నాటికి భోగాపురం విమానాశ్రయం పూర్తి చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఆ బాధ్యతను కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుపై ఉంచానని అన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి భోగాపురం విమానాశ్రయం ఎంతో కీలకమని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఈ ప్రాంతానికి భోగాపురం విమానాశ్రయం గ్రోత్ ఇంజన్ గా పనిచేస్తుందని, తద్వారా ఇది ఎకనామిక్ హబ్ గా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
భోగాపురం వరకు బీచ్ రోడ్డు నిర్మాణం జరగాల్సి ఉందని, ఇండస్ట్రియల్ కారిడారుగా ఎదిగేందుకు భోగాపురానికి మంచి అవకాశాలున్నాయని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. గత ప్రభుత్వ వైఖరి వల్ల భోగాపురం విమానాశ్రయం నిర్లక్ష్యానికి గురైందని చెప్పారు. వాస్తవానికి తమ హయాంలోనే భోగాపురం విమానాశ్రయానికి అనుమతులు వచ్చాయని, అది పూర్తయితే 48 లక్షల మంది ప్రయాణికులతో విమానాశ్రయం కిటకిటలాడుతుందని చెప్పారు.
భోగాపురం ఎయిర్ పోర్ట్ పూర్తయితే ఉద్యోగాల కోసం యువత వేరే ప్రాంతాలకు తరలివెళ్లాల్సిన అవసరం లేదన్నారు. విశాఖపట్నం, విజయనగరం కలిసి పోతున్నాయని, అదే మాదిరిగా భవిష్యత్తులో విశాఖ, శ్రీకాకుళం కూడా కలిసిపోతాయని చెప్పారు. విశాఖకు మెట్రో రావాల్సిందని, భవిష్యత్తులో కుప్పంతో పాటు ఏపీకి 5 విమానాశ్రయాలు వస్తాయని చంద్రబాబు చెప్పారు.
ఇక, ఏపీకి సుదీర్ఘ తీర ప్రాంతం ఉందని, మాలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. విశాఖలో నిర్వహించిన సిఐఐ నేషనల్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న సందర్భంగా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో స్కిల్ సెన్సెస్ పై ఫోకస్ చేశామని, ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాలు అందించుకునేందుకు స్కిల్ సెన్సస్ ఉందని చెప్పారు. తయారీ రంగానికి ఏపీ వ్యూహాత్మక ప్రాంతమని అన్నారు.