ఏపీలో ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్సీపీ చిత్తు చిత్తుగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. కేవలం 11 సీట్లే గెలవడంతో వైసీపీ అసెంబ్లీలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయింది. ఈ క్రమంలోనే వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురించి ఓ న్యూస్ తెగ ట్రెండ్ అవుతుంది. పులివెందుల ఎమ్మెల్యే స్థానానికి జగన్ రాజీనామా చేయబోతున్నారని.. అలాగే తన సోదరుడు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డితో కూడా రాజీనామా చేయించి.. అక్కడ ఉప ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచనలో మాజీ సీఎం ఉన్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.
ఎంపీగా ఉంటే తనపై ఉన్న అక్రమాస్తుల కేసులను మ్యానేజ్ చేసుకోవచ్చని జగన్ భావిస్తున్నారని.. అందుకే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కడప ఎంపీగా పోటీ చేయబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారానికి తెలంగాణ సీఎం రేవంత్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు మరింత బలాన్ని చేకూర్చాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి వేడుకల్లో అతిథిగా హాజరైన రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
కడప లోక్ సభకు ఉపఎన్నికలు రావచ్చనే మాట వినిపిస్తోందని.. అదే నిజమైతే వైఎస్ షర్మిల మళ్లీ పోటీ చేస్తారని… అప్పుడు అక్కడే మకాం వేసి గల్లీ గల్లీ తిరిగి ప్రచారం చేస్తానంటూ రేవంత్ రెడ్డి కామెంట్స్ చేశారు. ఆయన వ్యాఖ్యలతో జగన్ రాజీనామా విషయం రాష్ట్రంలో మరింత హాట్ టాపిక్ గా మారింది. దీంతో ఈ విషయంపై తాజాగా జగన్ బాబాయ్, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి క్లారిటీ ఇచ్చారు.
వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత తొలిసారి వైవీ సుబ్బారెడ్డి ఒంగోలులోని తన నివాసానికి వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో పలు అంశాలపై మాట్లాడారు. ఈ క్రమంలోనే జగన్ రాజీనామా గురించి మీడియా ప్రశ్నించింది. జగన్ రాజీనామాపై వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని వైవీ కుండబద్దలు కొట్టారు. రాజీనామా చేయాల్సిన పరిస్థితి లేనప్పుడు.. అటువంటి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏముంటుందని వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు. అలాగే ఏపీకి ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రం బాగుపడుతుందని.. అందుకు ప్రభుత్వం బలంగా కృషి చేయాలని ఆయన సూచించారు. ఏపీలో, కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వమే అధికారంలో ఉంది కాబట్టి.. ప్రత్యేక హోదా కోసం పోరాడాలన్నారు.