ఏపీలో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఓటమిపై తాజాగా బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించిన సంగతి తెలిసిందే. గత కొద్ది రోజుల నుంచి ఢిల్లీలో ఉంటున్న కేటీఆర్.. మంగళవారం మీడియాతో మాట్లాడారు. పేదలకు ఎన్నో మంచి పథకాలు అందించిన వైఎస్ జగన్ ఏపీలో ఓడిపోవడం.. అలాగే ప్రతినిత్యం ప్రజల్లో ఉన్న ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి ఓడిపోవడం తమను ఆశ్చర్యానికి గురిచేసిందని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
ఓటమి పాలైనా 40 శాతం ఓట్లు వైసీపీ సాధించడం మాములు విషయం కాదని.. ఒకవేళ పవన్ కళ్యాణ్ విడిగా పోటీ చేసి ఉంటే ఫలితాలు మరోలా ఉండేవని కేటీఆర్ కామెంట్స్ చేశారు. అయితే కేటీఆర్ వ్యాఖ్యలపై తాజాగా ఏపీ మంత్రి సత్య కుమార్ యాదవ్ రియాక్ట్ అయ్యారు. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే ఓటమిపై కేటీఆర్ చిలక పలుకులు పలుకుతున్నారని సత్య కుమార్ సెటైర్లు పేల్చారు.
`తెలంగాణలో ధరణి పేరుతో మీరు నడిపిన భూ మాఫియా లాగానే.. ధర్మవరంలో గుడ్ మార్నింగ్ పేరుతో మీ భూభకాసుర మిత్రుడు ప్రభుత్వ, అసైన్డ్, ప్రైవేటు, ప్రజలు ఆస్తులను ఆక్రమించాడు. చివరికి చెరువులు కొండలను కూడా కబళించాడు. గుడ్ మార్నింగ్ అంటే ప్రజలకు గుర్తుకు వచ్చేది కబ్జా-కలెక్షన్-కరప్షన్-కమీషన్లే. ఫాంహౌస్ కు పరిమితమైన మీరు X లో అడిగినా ధర్మవరం ప్రజలు సమాధానం చెబుతారు.
మీ అవినీతిని ప్రశ్నిస్తూ నిర్మాణాత్మక విమర్శ చేసినందుకు ట్విట్టర్ లో 4 సంవత్సరాల క్రితం నన్ను బ్లాక్ చేశారు. ఈ అవినీతి, అహంకారం, అసమర్థతే మిమ్మల్ని మీ ప్రియ మిత్రులు జగన్, కేతిరెడ్డిలను ఓడించాయి. ఒకే జాతి పక్షులు ఒకరికొకరు సర్టిఫికేట్ లు ఇచ్చుకుంటూ ఓదార్చుకోండి` అంటూ సత్య కుమార్ ఎక్స్ ఖాతా ద్వారా కేటీఆర్ కు స్ట్రోంగ్ కౌంటర్ ఇచ్చారు. అలాగే నాలుగేళ్ల క్రితం కేటీఆర్ తనను బ్లాక్ చేసిన ఫోటోను కూడా సత్య కుమార్ పోస్ట్ చేశారు.