ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 2024 ఎన్నికల్లో తన అధికారాన్ని నిలబెట్టుకోవడంలో పూర్తిగా విఫలం అయిన సంగతి తెలిసిందే. కూటమి అభ్యర్థులు వైకాపా నేతలను చిత్తుచిత్తుగా ఓడించారు. దాదాపు అన్ని జిల్లాల్లో క్లీన్ స్వీప్ చేశారు. 175 సీట్లకు వైసీపీ కేవలం 11 సీట్లను గెలుచుకుని చరిత్రలో నిలిచిపోయే ఓటమిని చవిచూసింది. అయినప్పటికీ ప్రజా తీర్పును గౌరవించేందుకు, ఓటమి నుంచి పాఠాలు నేర్చుకునేందుకు జగన్ ఏ మాత్రం మొగ్గు చూపడం లేదు.
రెండు వారాలు క్రితం ఈవీఎంల వల్ల ఓడిపోయామని చెప్పిన జగన్.. ఇటీవల చంద్రబాబు ఇచ్చిన మోసపూరిత హామీల వల్లే అధికారం కోల్పోయామంటూ కొత్త వాదన అందుకున్నారు. ఇక ఇదిలా ఉండగా.. మరో ఆసక్తికర విషయం తెరపైకి వచ్చింది. అసెంబ్లీకి జగన్ గుడ్ బై చెప్పబోతున్నారని ప్రస్తుతం బలంగా ప్రచారం జరుగుతోంది. సరైన సంఖ్యా బలం లేకపోవడం వల్ల అసెంబ్లీలో వైసీపీకి ప్రతిపక్ష హోదా తగ్గలేదు. ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ జగన్ స్పీకర్ అయ్యన్నపాత్రుడికి లేక రాసి గత వారం నానా హడావిడి చేశారు.
కానీ అధికార టీడీపీ జనసేన బీజేపీ కూటమి నుంచి సానుకూల స్పందన రాలేదు. కేవలం 11 మంది సభ్యుల సంఖ్యాబలం ఉండడం, ప్రతిపక్ష హోదా కూడా లేకపోవడం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని వైఎస్ జగన్ తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయాలని యోచిస్తున్నారట. కాగా, ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్ రెండోసారి కడప జిల్లా పర్యటనకు బయలుదేరారు. జూలై 8వ తేదీన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి. ఈ నేపథ్యంలోనే జగన్ సొంత నియోజకవర్గం పులివెందులకు వెళ్తున్నారు. మూడు రోజుల పాటు సాగనున్న ఈ పర్యటనలో శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయాలనే అంశంతో పాటు మరికొన్ని విషయాలపై జగన్ కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు.