తెలుగు సినీ పరిశ్రమకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కొత్త షరతులు విధించారు. ఇకపై టికెట్ రేట్లు పెంచుకోవాలి అంటే కచ్చితంగా సైబర్ క్రైమ్, డ్రగ్స్ పై సినిమాల్లో అవగాహన కల్పించాలని ప్రభుత్వం కొత్త గైడ్ లైన్ విడుదల చేసింది. అలా చేస్తేనే సినీ పరిశ్రమకు సహకరిస్తామని రేవంత్ రెడ్డి తేల్చేశారు. తాజాగా ఆయన హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ కార్యాలయంలో ఫొటో ఎగ్జిబిషన్ ను సందర్శించారు.
ఆపై సైబర్ సెక్యూరిటీ బ్యూరో, యాంటీ నార్కోటిక్ బ్యూరో డిపార్ట్మెంట్స్ కు నూతన వాహనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. డ్రగ్స్ మహమ్మారి ఎన్నో కుటుంబాలను, వ్యవస్థను నాశనం చేస్తుంది. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల డ్రగ్స్ వాడకం గల్లీ గల్లీలో విచ్చలవిడిగా పెరిగింది. మాదకద్రవ్యాల మత్తులో నేరాలు భారీగా జరుగుతున్నాయి. అందుకే డ్రగ్స్ నియంత్రణకు సిబ్బందిని కేటాయించామని తెలిపారు.
అలాగే సమాజాన్ని పట్టి పీడిస్తున్న డ్రగ్స్, సైబర్ నేరాలపై అవగాహన కల్పించడం సినిమా మాధ్యమానికి ఉన్న కనీస బాధ్యత. కానీ ఆ బాధ్యతను ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. సినిమా టికెట్ రేట్లు పెంచాలని ప్రభుత్వం దగ్గరకు వస్తున్నారు తప్పా.. డ్రగ్స్, సైబర్ నేరాలపై అవగాహన కల్పించడానికి ప్రయత్నం చేయడం లేదు.
అయితే ఇకపై సినిమా టికెట్ రేట్లు పెంచాలంటే సినిమాకు ముందుగానీ, తరువాత గానీ 3 నిమిషాల వీడియోతో డ్రగ్స్, సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి. ప్రతీ సినిమా రిలీజ్ టైమ్‌లో నటీనటులతో డ్రగ్స్‌కు వ్యతిరేకంగా షార్ట్ వీడియో చేయాలి. చిరంజీవి గారిలా అవగాహన కల్పించాలి. అలా కల్పించకపోతే వారి చిత్రాలకు టికెట్ రేటు పెంచే ప్రసక్తే లేదు. అలాగే ఈ షరతులు పట్టించుకోని దర్శకనిర్మాతలకు, నటీనటులకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయ, సహకారాలు లభించవు అని తాజాగా రేవంత్ రెడ్డి తెలిపారు.