ఏపీ నూతన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనదైన మార్క్ పాలనతో దూసుకుపోతున్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చుతూ ముందుకు సాగడమే కాకుండా గత వైకాపా పాలనలో జరిగిన అన్యాయాలను, అక్రమాలను వరుసగా బయట పెడుతున్నారు. అలాగే తప్పు చేసిన వారికి ఇవ్వాల్సిన రిటర్న్ గిఫ్ట్ లు కూడా ఇస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం డిప్యూటీ సర్వేయర్ ఎస్. సద్దాం హుస్సేన్ ను సస్పెండ్ చేశారు.
జగన్ హయాంలో ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగులు ఎంత లంచగొండులుగా మారిపోయారో చెప్పడానికి సద్దాం హుస్సేన్ స్టోరీ ఒక ఉదాహరణ. పూర్తి వివరాల్లోకి వెళితే.. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చంద్రబాబు కుప్పంలో ఇల్లు కట్టుకోవాలని భావించి శాంతిపురం మండలం కొండపల్లి పంచాయతీ శివపురం వద్ద కొంత స్థలాన్ని కొనుగోలు చేశారు. అది రహదారి పక్కనే ఉన్న వ్యవసాయ భూమి. ఇల్లు కట్టుకోవాలంటే ల్యాండ్ కన్వర్షన్ చేయాల్సి ఉంటుంది.
ఇందుకోసం టీడీపీ నాయకులు భూ వినియోగ మార్పిడికి దరఖాస్తు చేశారు. స్థలాన్ని సబ్ డివిజన్ చేయాలని కోరగా.. డిప్యూటీ సర్వేయర్ సద్దాం హుస్సేన్ రూ.1.80 లక్షల లంచం డిమాండ్ చేశాడు. చంద్రబాబు ఇల్లు అని తెలిసినా కూడా సదరు సర్వేయర్ వెనక్కి తగ్గలేదు. తప్పని పరిస్థితుల్లో ఆ మొత్తాన్ని ఇవ్వడంతో దస్త్రం ముందుకు వెళ్ళింది.
అయితే ఇటీవల చంద్రబాబు కుప్పం పర్యటనకు వచ్చిన వేళ స్థానికి నేతలు ఆ విషయాన్ని చర్చకు తీసుకొచ్చారు. మరోవైపు ఒక రైతు కూడా తన భూమిని సర్వే చేయడానికి రూ. లక్ష లంచం తీసుకున్నారని సదరు సర్వేయర్ పై ఫిర్యాదు చేశారు. దాంతో చంద్రబాబు ఆదేశాల మేరకు ఉన్నత అధికారులు రంగంలోకి దిగి విచారణ చేపట్టగా.. లంచం తీసుకున్నది నిజమే అని తేలిపోయింది. వెంటనే జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు సద్దాం హుస్సేన్ పై సస్పెన్షన్ వేటు వేశారు.