ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కి సడెన్‌గా చంద్రబాబు గుర్తుకు వచ్చారు. వాస్తవానికి ఎన్డీయే కూటమి పార్టీలోనే చంద్రబాబు ఉన్నా .. ప్రధానికి ఆయన గుర్తుకురావాలని ఏమీ లేదు. ఎందుకంటే.. కేంద్రంలో పరిస్థితులు ఏమంత ఆశాజనకంగా లేవు. దీంతో ఆ యన బిజీలో ఆయన ఉన్నారు అయినప్పటికీ.. మోడీ అనూహ్యంగా చంద్రబాబును గుర్తు చేసుకున్నారు. ఊరకరారు మహాను భావులు అన్నట్టుగా చంద్రబాబును మోడీ ఊరికేనే తలుచుకుంటారా? అంటే.. కాదనే అంటున్నారు పరిశీలకులు. రాజకీయాల్లో కొన్ని వ్యూహాలు ఉంటాయి. సామదాన బేధ.. అన్నట్టుగా.. చంద్రబాబు విషయంలో మొహమాటం అనే మంత్రం వేస్తున్నారనేది కీలకం.
అదేంటి? అంటే.. ఇక్కడే ఉంది అసలు కిటుకు. చంద్రబాబు బహు మొహమాటస్థుడు అనే మాట తెలిసిందే. ఆయనను ఎవరైనా పొగిడితే.. ఇట్టే బుట్టలో పడతారు. ఇప్పుడు ఈ ఫార్ములానే చంద్రబాబు విషయంలో మోడీ ఎంచుకున్నట్టు తెలుస్తోంది. చంద్రబా బును ఎంత పొగిడితే.. అంత ఇప్పుడు ఆయనకు మేలు జరుగుతుంది. దీనికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి.. బిహార్ రాష్ట్రం నుంచి మోడీపై ప్రత్యేక హోదా విషయంలో ఒత్తిడి వస్తోంది. అక్కడి సీఎం నితీష్ కుమార్.. మోడీకి సైలెంట్‌గా సెగ పెడుతున్నారు. దీనికి అక్కడి ఎన్డీయే కూటమి పార్టీ అయిన ఎల్జీపీ కూడా.. వంత పాడుతోంది. దీంతో మోడీకి ఇష్టంలేని హోదాపై గళాలు పెరుగుతున్నాయి.
ఇదేసమయంలో ఇదే డిమాండ్‌ను ఏపీ కూడా వినిపించాలని నలుమూలల నుంచి చంద్రబాబుపై ఒత్తిడి పెరుగుతోంది. ఇటీవల కాంగ్రెస్ జాతీయ నేతలు కూడా.. బిహార్ సీఎం ప్రత్యేక హోదా అడగుతున్నారు. మీ సంగతేంటని కెలుకుతున్నారు. దీనిపై చంద్ర బాబు ఇంకా ఆలోచన సారించలేదు. అయితే.. ఇంటా బయటా కనుక ఒత్తిడి పెరిగితే.. ఆయన కూడా.. బిహార్‌కు ఇస్తున్నారు కాబట్టి.. మనకు కూడా కావాలంటూ.. ఆయన గళం వినిపించే అవకాశం ఉంది. దీనిని ముందుగానే పసిగట్టిన మోడీ.. చంద్రబాబును మచ్చిక చేసుకునే పనిలో పడ్డారు. దీనిలో భాగంగానే అరకు కాఫీ అంటూ.. మన్‌కీబాత్‌లో ప్రస్తావించారు.
ఎప్పుడో 2016లో విశాఖపట్నంంలో జరిగిన ఓ ఘటనను మోడీ తన మన్‌కీ బాత్‌లో ప్రస్తావించారు. చంద్రబాబు తో కలిసి కాఫీ తాగానని అద్భుతమైన కాఫీని చంద్రబాబు తనకు రుచి చూపించారని పొగడ్తలురువ్వారు. అంతేకాదు.. చంద్రబాబుతో అప్పట్లో కలిసి కాఫీ తాగుతున్న ఫొటోను కూడా.. మోడీ షేర్ చేసుకున్నారు. ఇంతలో చంద్రబాబు కూడా.. రియాక్ట్ అయ్యారు. మోడీకి ధన్యవాదాలు చెప్పారు. ఖచ్చితంగా ఇలాంటి స్పందననే మోడీ కోరుకున్నారు. చంద్రబాబు చేసేశారు. తద్వారా.. ఆయనకు సెగ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు పరిశీలకులు. ఇదీ.. సంగతి!!