ఏపీలో కొత్తగా ఏర్పడిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏడు ప్రభుత్వ శాఖల్లో స్థితిగతులపై శ్వేతపత్రాలు విడుదల చేస్తామని ఇప్పటికే నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు నాయుడు తొలి శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. నదుల అనుసంధానానికి గుండె అయిన పోలవరం వైకాపా పాలనలో ఎంతలా నష్టపోయింది..? గత ఐదేళ్లలో ప్రాజెక్టు నిర్మాణం ఏ మేరకు సాగింది..? ముందున్న సవాళ్లు ఏంటి..? వంటి నిజాలను చంద్రబాబు ప్రజల ముందు ఉంచారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి, పోలవరం రెండు ప్రధాన ప్రాజెక్టులు. వీటిని పూర్తి చేసుకుంటే విభజన లో జరిగిన నష్టాన్ని, అన్యాయాన్ని పూడ్చుకోవచ్చు. కానీ జగన్ ప్రభుత్వ హయాంలో ఈ రెండు ప్రాజెక్టుల నిర్మాణం కుంటుపడిందని చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే వ్యవసాయ రంగానికి ఊతం వస్తుంది. అలాంటి ప్రాజెక్టు విషయంలో జగన్ క్షమించరాని నేరం చేశారు. విభజన వల్ల జరిగిన నష్టం కంటే జగన్ చేసిన నష్టమే ఎక్కువగా కనిపిస్తోందని చంద్రబాబు మండిపడ్డారు.
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 72% ప్రాజెక్టు పూర్తయిందని.. 2014 నుంచి 19 మధ్య పోలవరానికి రూ. 11, 762 కోట్లు ఖర్చు పెట్టమని చంద్రబాబు వివరించారు. గత ఐదేళ్ల వైకాపా పాలనలో కేవలం 3.84 శాతమే పనులు జరిగాయని.. అందుకు ప్రభుత్వం రూ. 4,167 కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. అలాగే ప్రాజెక్టులో కీలకమైన డయాఫ్రమ్ను వాల్ నిర్మాణాన్ని 414 రోజుల్లో అత్యాధునిక సాంకేతికతతో పూర్తి చేశాం. కానీ వైసీపీ అధికారంలోకి రాగానే రివర్స్ టెండరింగ్ చేపట్టారు. ఏజెన్సీ తో పాటు సిబ్బందిని మార్చారు. జగన్ మూర్ఖత్వం వల్ల డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది.
డయా ఫ్రమ్ వాల్ ను తాము రూ. 436 కోట్లతో పూర్తి చేస్తే.. ఇప్పుడు దాని మరమ్మత్తులకే రూ. 447 కోట్లు ఖర్చవుతుందని చంద్రబాబు పేర్కొన్నారు. గతంలో ఏజెన్సీని మార్చకుండా పోలవరం ప్రాజెక్టును కొనసాగించుంటే 2020 జనవరి నాటికి పూర్తి అయ్యేదని.. జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల రూ. 4,900 కోట్ల నష్టం జరిగిందని, ఖర్చు 38% పెరిగిందని వెల్లంచారు. అంతేకాకుండా జగన్ అరాచక పాలనతో విద్యుత్ ఉత్పత్తిని కోల్పోయాం. దీని ద్వారా రూ. 3 వేల కోట్లు నష్టపోయామని.. పోలవరం ఆలస్యంతో మరోవైపు రైతులకు రూ. 45 వేల కోట్ల నష్టం జరిగిందని చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. ఇప్పుడు పోలవరం కంప్లీట్ చేయడానికి నాలుగు సీజన్లు కావాలని అధికారులు చెబుతున్నారని.. అన్ని సవ్యంగా జరిగితే ప్రాజెక్ట్ పూర్తి కావడానికి నాలుగేళ్లు పడుతుందని వెల్లడించారు.