అంతా అనుకున్నట్లు జరిగి ఉంటే ఈ ఆగస్టు 15 కి మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప-2 రిలీజ్ కావాల్సింది. పాన్ ఇండియా స్థాయిలో బంపర్ క్రేజ్ తెచ్చుకున్న ఆ చిత్రానికి ఏ భాషలోనూ చెప్పుకోదగ్గ సినిమా ఏదీ ఎదురు వెళ్లేది కాదు. కానీ షూటింగ్ ఆలస్యం వల్ల ఆ చిత్రాన్ని డిసెంబరు 5కు వాయిదా వేసేశారు. దీంతో వివిధ భాషల్లో ఇండిపెండెన్స్ డే వీకెండ్‌కు వేరే సినిమాలు వరుసగా షెడ్యూల్ అవుతున్నాయి.
తెలుగులో పుష్ప-2 వాయిదా గురించి అధికారిక ప్రకటన రావడానికి ముందే రామ్-పూరి జగన్నాథ్‌ల డబుల్ ఇస్మార్ట్‌ను ఆగస్టు 15న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ అలాంటి క్రేజీ మూవీ వస్తున్న సంగతి తెలిసి కూడా ఆగస్టు 15కు కొత్తగా వరుసబెట్టి సినిమాలను అనౌన్స్ చేస్తున్నారు. నార్నె నితిన్ హీరోగా గీతా ఆర్ట్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఆయ్ మూవీని ఆగస్టు 15న విడుదల చేయబోతున్నట్లు తాజాగా ప్రకటించారు. ఇదే రోజుకు మరో రిలీజ్ కూడా అనౌన్స్ అయింది. రానా దగ్గుబాటి సమర్పణలో నివేథా థామస్ ప్రధాన పాత్రలో ఏషియన్ మూవీస్ తెరకెక్కించిన 34 మూవీని కూడా ఆగస్టు 15న రిలీజ్ చేయబోతున్నట్లు అనౌన్స్ చేశారు.
ఇదిలా ఉండగా.. సెప్టెంబరు 27కు అనుకున్న లక్కీ భాస్కర్‌ను ముందుకు తీసుకు వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ రోజుకు దేవర ఫిక్స్ కావడంతో లక్కీ భాస్కర్‌ను ఆగస్టు 15న రిలీజ్ చేద్దామనుకుంటున్నారట. త్వరలోనే ప్రకటన వస్తుందని చెబుతున్నారు. ఇదిలా ఉండగా గోపీచంద్-శ్రీను వైట్ల మూవీ విశ్వంను కూడా నిర్మాతలు ఆగస్టు 15కే అనుకుంటున్నారట. డబుల్ ఇస్మార్ట్‌కు డేట్ ఇచ్చారు తప్ప ఆగస్టు 15న రాదనే సమాచారంతోనే వేరే చిత్రాలు చాలా లైన్లోకి వస్తున్నాయి. ఎవరికి వారు డేట్లు ఇస్తుండడంతో ఈ వీకెండ్ కోసం కోల్డ్ వార్ తప్పేలా లేదు. చివరికి రేసులో ఎన్ని చిత్రాలు నిలుస్తాయో చూడాలి.