పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. ఒకప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెద్దారెడ్డి. వైకాపా పాలనలో సెకండ్ సీఎంగా వెలిగిన ఆయన రాయలసీమ జిల్లాలను తన కనుసైగలతో శాసించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాను మకుటం లేని మహారాజులా ఏలారు. గత 15 ఏళ్లుగా పుంగనూరు రాజకీయాలను శాసిస్తున్నారు. అయితే పెద్దిరెడ్డి ఏకచత్రాధిపత్యానికి కళ్లెం పడింది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో దేశ చరిత్రలో ఎక్కడా ఎన్నడూ లేని విధంగా ఉమ్మడి కూటమికి రాష్ట్ర ప్రజలు పట్టం కట్టారు.
గత ఎన్నికల్లో 151 సీట్లతో అధికారంలోకి వచ్చిన వైకాపా.. ఈసారి కేవలం 11 సీట్లతో సరిపెట్టుకుంది. అయితే ఆ 11 స్థానాల్లో పుంగనూరు కూడా ఒకటి. వరుసగా నాలుగోసారి పుంగనూరు ఎమ్మెల్యేగా పెద్దిరెడ్డి గెలుపొందారు. అది కూడా కేవలం 6 వేల ఓట్లతో బయటపడ్డారు. అయితే పెద్దిరెడ్డి గెలిచినా కూడా ఓడినట్లే అన్నట్లుగా పరిస్థితి ఉంది. ఏడు సార్లు ఎమ్మెల్యేగా, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ జగన్ మంత్రివర్గంలో పలు శాఖలకు ప్రాధనిత్యం వహించిన పెద్దిరెడ్డి ఇప్పుడు సొంత సొంత నిజయోకవర్గమైన పుంగనూరులో కాలు పెట్టలేకపోతున్నారు.
పెద్దిరెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబును ఓడిస్తానని.. చిత్తూరు జిల్లాలోని కుప్పంలో ఆయన్ను కాలు పెట్టకుండా చేస్తానని సవాల్ విసిరారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. చంద్రబాబు 2024 ఎన్నికల్లో గెలిచి నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ వెంటనే కుప్పంలో తొలి పర్యటన కూడా ముగించుకున్నారు. కానీ ఎన్నికల ఫలితాలు విలువడి ఇరవై రోజులైనా పెద్దిరెడ్డి మాత్రం పుంగనూరు వెళ్లలేకపోయారు.
రెండు, మూడుసార్లు సొంత నియోజకవర్గానికి వెళ్లడానికి పెద్దిరెడ్డి ప్రయత్నించినా కూడా శాంతిభద్రతల సమస్య వస్తుందని పోలీసులు అందుకు అనుమతించడం లేదు. ప్రతిపక్ష నేతగా టీడీపీ అధినేత చంద్రబాబు పుంగనూరు పర్యటనకు వస్తే రాళ్ల దాడులు చేయించడం, టీడీపీ క్యాడర్‌పై దాడులకు దిగడం, తన అనుచరుల ఆగడాలకు అడ్డకట్ట వేయకపోవడం వంటి అంశాలు పెద్దిరెడ్డికి ఇప్పుడు దారుణమైన పరిస్థితిని తీసుకొచ్చాయి. పెద్దిరెడ్డి తీరుకు పీకలదాకా కోపంతో ఉన్న టీడీపీ క్యాడర్.. ఆయన పుంగనూరు వస్తే అడ్డుకుంటామని బహిరంగంగా హెచ్చరికలు ఇస్తోంది. దీంతో పెద్దిరెడ్డి ఇప్పట్లో పుంగనూరులో కాలు పెట్టే అవకాశాలు కనిపించడం లేదు.