2024 సార్వత్రిక ఎన్నికల్లో అధికార వైసీపీ చారిత్రాత్మక ఓటమిని మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. 2019 ఎన్నికల్లో 151 సీట్లు సాధించి యావత్ దేశాన్ని నివ్వెర పరిచిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ఈసారి కేవలం 11 సీట్లతో సరిపెట్టుకున్నారు. కూటమిగా ఎన్నికల బరిలోకి దిగిన టీడీపీ-జనసేన-బీజేపీ పార్టీలు దాదాపు అన్ని జిల్లాల్లో క్లీన్ స్వీప్ చేశాయి. దీంతో ఇప్పుడు రాజకీయ రంగస్థలం మీద నిలదొక్కుకునేందుకు మరియు పార్టీ భవిష్యత్తు కోసం జగన్ నడుం బిగించారు. అందుకు ఓదార్పు యాత్ర ఒక్కటే పరిష్కారమని ఆయన భావిస్తున్నారు.
గతంలో వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబాలను కలిసేందుకు జగన్ నిర్వహించిన ఓదార్పు యాత్ర పార్టీకి మంచి మైలేజ్ ఇచ్చింది. దాంతో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ దాడుల్లో గాయపడిన వారితో పాటు వైసీపీ ఓటమి కారణంగా మృతి చెందిన వారిని పరామర్శించేందుకు ఓదార్పు యాత్ర చేపట్టాలని జగన్ ప్రాథమికంగా నిర్ణయించారు.
ఈ యాత్ర డిసెంబర్ నుంచి ప్రారంభం కావొచ్చని అంటున్నారు. అయితే గతంలో ఓదార్పు యాత్ర అంటూ జనంలోకి వెళ్లి జగన్ పై ప్రజలు పూల వర్షం కురిపించారు. కానీ ఈసారి వెళ్తే మాత్రం రాళ్లు పడటం ఖాయమని అంటున్నారు. ఎందుకంటే, రాష్ట్రంలో అప్పుడున్న పరిస్థితులు వేరు.. ఇప్పుడున్న పరిస్థితులు వేరు. నాడు వైఎస్ పైనున్న ఆదరణ వల్ల ఓదారు యాత్ర సూపర్ సక్సెస్ అయింది. ఆయన వారసుడిగా ఒక్క ఛాన్స్ ఇవ్వమని, రాజన్న రాజ్యం తీసుకొస్తానని చెప్పిన జగన్ కు ప్రజలు జేజేలు పలికారు. అధికారాన్ని కట్టబెట్టారు.
అటువంటి ప్రజల రుణాన్ని తీర్చుకోవాల్సింది పోయి.. అరాచక పాలనతో గత ఐదేళ్లు వారిని జగన్ ప్రభుత్వం అష్ట కష్టాలు పెట్టింది. సీన్ కట్ చేస్తే.. ఈసారి ఎన్నికల్లో యావత్ ఆంధ్రావని ఏకపక్షంగా తీర్పు ఇచ్చింది. జగన్ ప్రభుత్వాన్ని పాతాళానికి తొక్కి కూటమి వైపు మొగ్గు చూపించింది. ఇటువంటి సమయంలో జగన్ ఓదార్పు యాత్ర చేపడితే వైసీపీకి మునుపటి తరహాలో ఆదరణ రావడం అటుంచు.. జనాలు ముఖం మీదే ఛీ కొడతారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.