సాధారణంగా పేద ప్రజలకు ఇళ్ల స్థలాలను కేటాయించడానికి రోజులు కాదు నెలలు కాదు ఏళ్లకు ఏళ్లు కార్యాలయాల చుట్టూ తిప్పించుకునే ప్రభుత్వాలు.. అధికారంలో ఉన్నప్పుడు తమకు కావాల్సిన చోట కావాల్సినంత విస్తీర్ణంలో కావాల్సిన విధంగా పార్టీ ఆఫీసులను మాత్రం చకచకా నిర్మించుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ఐదేళ్ల వైకాపా పాలనలో జగన్ మోహన్ రెడ్డి తనకున్న ప్యాలెస్ ఫ్యాంటసీతో జనం సొమ్మును విచ్చలవిడిగా ఖర్చు పెట్టేశారు. అధికారంలో ఉంటే ఏమైనా చేస్తానని నిరూపించుకున్నారు.
తాడేపల్లి ప్యాలెస్, బెంగళూరు యలహంక ప్యాలెస్, హైదరాబాద్ లోటస్ పాండ్ ప్యాలెస్, రుషికొండ ప్యాలెస్, ఇడుపులపాయ ప్యాలెస్ ఇలా తొమ్మిది నగరాల్లో జగన్ తన సొంతానికి ప్యాలెస్ లు కట్టుకున్నారు. అక్కడితో ఆగని ఆయన పార్టీ జిల్లా కార్యాలయాలకు సైతం మైసూరు రాజమహల్ ను తలదన్నేలా భవనాలను కట్టించారు. ఇందులో భాగంగా ప్రతి జిల్లాలోనూ అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రభుత్వ భూములను కబ్జా చేశారు.
26 జిల్లాల్లో 42.24 ఎకరాలు ప్రభుత్వ భూమిని జగన్ ఊరూరా తన పార్టీ ఆఫీసుల పేరిట నిర్మించే ప్యాలెస్ల కోసం 33 ఏళ్ళు లీజుకి ఇచ్చేశారు. 42.24 ఎకరాల భూమి విలువ రూ.688 కోట్లు కాగా.. ఏడాదికి ఎకరానికి కేవలం రూ.వెయ్యికి చొప్పున లీజుకి కట్టబెట్టారు. 26 జిల్లాల్లో 26 ప్యాలెస్ ల నిర్మాణానికి జగన్ మోహన్ రెడ్డి రూ.500 కోట్లకు పైగా ప్రజాధనాన్ని ఖర్చు పెడుతున్నారు.
పైగా ఈ 26లో ఒక్క ప్రకాశం తప్ప, ఏ భవనానికి అనుమతులు లేవు. ఈ ప్యాలెస్ లు అన్నీ వైసీపీ ఎంపీ ఆళ్ల అయోధ్యరామిరెడ్డి కి చెందిన రాంకీ ఇన్ఫ్రా సంస్థే కడుతోంది. ఒకప్పుడు అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడితే ఎంత పెద్ద వారిదైనా కూల్చేయాల్సిందే అని జగన్ అసెంబ్లీలో నీతులు వల్లించారు. కానీ ఆయన మాత్రం పాటించలేదు. దీంతో ప్రస్తుతం జగన్ ప్యాలెస్ ఫ్యాంటసీ పెద్ద ఇష్యూగా మారింది.