పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఫిల్మ్ `కల్కి 2898 ఏడీ` వచ్చే శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. దాదాపు రూ. 600 కోట్ల బడ్జెట్ తో నిర్మితమైన ఈ చిత్రంలో టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఎంతో మంది స్టార్స్ భాగం అయ్యారు. ప్రధాన పాత్రల్లో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, కమల్ హాసన్, దిశా పటానీ, పశుపతి నటించారు.
డార్లింగ్ అభిమానులే కాకుండా యావత్ భారతీయ సినీ ప్రియులందరూ ఈ చిత్రం కోసం ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రధాన ఏరియాల్లో కల్కి మూవీ థియేట్రికల్ రైట్స్ కళ్ళు చెదిరే రేటుకు అమ్ముడు పోయాయి. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు బయటకు వచ్చాయి. వరల్డ్ వైడ్ గా కల్కి 2898 ఏడీ చిత్రం థియేటర్ హక్కులను ఏకంగా రూ. 394 కోట్లకు విక్రయించినట్లు తెలుస్తోంది
ఆంధ్రాలో ఈ సినిమాకు రూ. 85 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అలాగే నైజాం థియేట్రికల్ హక్కులను రూ.70 కోట్లకు, సీడెడ్ లో రూ.27 కోట్లకు విక్రయించారు. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కల్కి థియేట్రికల్ బిజినెస్ రూ.182 కోట్లు కాగా.. కర్ణాటకలో రూ.30 కోట్లు మరియు తమిళనాడు, కేరళలో రూ.22 కోట్లకు థియేట్రికల్ రైట్స్ అమ్ముడయ్యాయి. ఉత్తరాదిలో కల్కి మూవీని ఏఏ ఫిల్మ్స్ వారు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. సదరు సంస్థ రూ.80 కోట్లకు కల్కి హక్కులను సొంతం చేసుకుంది.
ఇకపోతే విదేశాల్లోనూ ప్రభాస్ కు మంచి క్రేజ్ ఉండటం వల్ల ఓవర్సీ లో కల్కి మూవీ థియేట్రికల్ హక్కుల ధర రూ.80కోట్లు పలికాయి. మొత్తంగా ఈ చిత్రం రూ. 394 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంది. దీంతో ఇప్పుడు ప్రభాస్ ఎదుట భారీ టార్గెట్ వచ్చి పడింది. కల్కి 2898 ఏడీ బాక్సాఫీస్ వద్ద క్లీన్ హిట్ కావాలంటే ఫుల్ రన్ లో రూ. 388 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంటుందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.