భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఉన్న గొప్ప నటీమణుల్లో సాయి పల్లవి ఒకరు అనడంలో ఎటువంటి సందేహం లేదు. మేకప్ లేకుండా నేరుగా కెమెరా ముందుకు వచ్చి యాక్ట్ చేసే ఏకైక హీరోయిన్ సాయి పల్లవి. కెరీర్ ఆరంభం నుంచి గ్లామర్ షోకు ఆమడ దూరంలో ఉంటూ తన సహజ నటనతో ప్రేక్షకులకు చేరువైందామె. సౌత్ ఇండస్ట్రీలో లేడీ పవర్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకుంది. తన ప్రతిభతో ప్రస్తుతం బాలీవుడ్ లో సైతం అవకాశాలు దక్కించుకుంటోంది.
దాదాపు 500 కోట్ల బడ్జెట్ తో ఉత్తరాదిన దంగల్ డైరెక్టర్ నితీష్ తివారీ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న రామాయణం సినిమాలో ఇప్పటికే సాయి పల్లవి భాగమైంది. ఈ చిత్రంలో రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతా దేవి గా నటిస్తున్నారు. అలాగే కన్నడ రాకింగ్ స్టార్ యశ్ రావణాసుడి పాత్రను పోషిస్తున్నాడు. కొద్ది నెలల క్రితం ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. సెట్స్ నుంచి రణబీర్, సాయి పల్లవి లుక్స్ కూడా లీక్ అయ్యాయి. సీతారాములుగా వారిద్దరిని చూసి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.
అయితే తాజాగా బాలీవుడ్ నటుడు సునీల్ లహ్రీ సాయి పల్లవిపై షాకింగ్ కామెంట్ చేశాడు. సాయి పల్లవిలో సీతాదేవి లక్షణాలు లేవంటూ అతను వ్యాఖ్యానించాడు. గతంలో రామాయణం టీవీ సీరియల్ లో సునీల్ లహ్రీ లక్ష్మణుడి పాత్రలో నటించడం జరిగింది. బుల్లితెరపై లక్ష్మణుడి గా పాపులర్ అయిన సునీల్ లహ్రీ.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న రామాయణం సినిమా గురించి ఆయన మాట్లాడారు.
యానిమల్ తర్వాత రణబీర్ ను రాముడిగా ప్రేక్షకులు అంగీకరించడం కష్టమే అంటూ వ్యాఖ్యానించారు. మరోవైపు సాయి పల్లవి గురించి మాట్లాడుతూ.. నటిగా ఆమె ఎలా ఉంటుందో తెలియదు. ఆమె చేసిన సినిమాలు ఇప్పటివరకు నేను చూడలేదు. కానీ లుక్స్ పరంగా ఆమెలో దేవత లక్షణాలు లేవు అంటూ కామెంట్స్ చేశారు. దీంతో ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. సాయి పల్లవి అభిమానులు, సినీ ప్రియులు సునీల్ లహ్రీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు సాయి పల్లవి నటించిన సినిమాలు చూడకుండా మీరు అలా ఎలా కామెంట్ చేస్తారు సార్ అంటూ మండిపడుతున్నారు. సీత పాత్రకు సాయి పల్లవినే పర్ఫెక్ట్ ఛాయిస్ అని అభిప్రాయపడుతున్నారు.