కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ మూడోసారి అధికారంలోకి రావడంతో టీడీపీ అధినేత చంద్రబాబు కీలక పాత్ర పోషించారు. ప్రధాని మోడీ కూడా ఇదే విషయాన్ని పలుమార్లు చెప్పారు. ఈ క్రమంలోనే కింగ్ మేకర్ అంటూ రాష్ట్రంతో పాటు అటు కేంద్రంలో చక్రం తిప్పే అవకాశం వచ్చిన చంద్రబాబు పేరు జాతీయ రాజకీయాల్లో మార్మోగిపోతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా స్టాక్ మార్కెట్లపై చంద్రబాబు ఎఫెక్ట్ చర్చనీయాంవమైంది.
ఏపీ, చంద్రబాబు తాలూకు స్టాక్స్ ఇప్పుడు ఇన్వెస్టర్లకు వరంగా మారాయి. ఆ షేర్లు మార్కెట్లో హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. దీంతో, గత 8 సెషన్లలోనే ఆ షేర్ల ఎం-క్యాప్ 20వేల కోట్లు పెరిగింది. హెరిటేజ్ ఫుడ్స్, కేసీపీ, ది ఆంధ్రా సుగర్స్, పెన్నార్ ఇండస్ట్రీస్, ఎన్సీఎల్ ఇండస్ట్రీస్ వంటి స్టాక్స్ భారీ లాభాలతో దూసుకుపోతున్నాయి. ఇన్ఫ్రా సంబంధిత స్టాక్స్ పై కూడా స్టాక్ మార్కెట్ నిపుణులు ఆసక్తి చూపడానికి చంద్రబాబే కారణమిన ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇక, నారా కుటుంబానికి చెందిన హెరిటేజ్ ఫుడ్స్ ను ఐటీ శాఖా మంత్రి నారా లోకేశ్ ప్రమోట్ చేస్తున్నారు. హెరిటేజ్ లో లోకేశ్ 40 శాతం వాటా కలిగి ఉన్నారు. కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్, అమరరాజాతో పాటు పలు సిమెంట్ సంస్థలు డబుల్ డిజిట్ లాభాలతో దూసుకుపోతున్నాయి. ఆంధ్రా స్టాక్స్ ఎం-క్యాప్ మొత్తం విలువ జూన్ 4వ తేదీ నుంచి 2,19,000 కోట్లుగా కొనసాగుతుండడంతో మదుపరులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక, రాజధాని అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా జోరుగా సాగుతోంది.