ఏపీలో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అఖండ మెజారిటీతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ రోజు ఏపీ సీఎంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. నాలుగో సారి సీఎంగా చంద్రబాబు రికార్డు స్థాయిలో ప్రమాణ స్వీకారం చేశారు. ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా చంద్రబాబు ప్రమాణం చేశారు.
‘‘నారా చంద్రబాబు నాయుడు అనే నేను…’’ అనగానే తెలుగు తమ్ముళ్లు చప్పట్లు, కేరింతలు, ఈలల కొట్టడంతో సభా ప్రాంగణం దద్దరిల్లింది. ‘‘శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా… రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికి న్యాయం చేకూర్చుతానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను’’ అని చంద్రబాబు దైవ సాక్షిగా తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు.
ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చంద్రబాబును ప్రధాని నరేంద్ర మోదీ ఆప్యాయంగా హత్తుకొని మీకు నేనున్నాను అని వెన్నుతట్టి అభినందించారు. చంద్రబాబును హత్తుకొని మోడీ ఎమోషనల్ అయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. గవర్నర్ అబ్దుల్ నజీర్ తదితరులు చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ తనయుడు రామకృష్ణ ఇతర కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు. చంద్రబాబుతోపాటు 24 మంది మంత్రులు ప్రమాణం చేయనున్నారు.
ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, కేంద్ర మంత్రి జేపీ నడ్డా, బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, మాజీ సీజేఐ ఎన్వీ రమణ, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, బీజేపీ నేత ఈటల రాజేందర్, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, ఆయన సతీమణి రమ్య, మెగాస్టార్ చిరంజీవి, హీరో రామ్ చరణ్, దర్శకుడు క్రిష్, హీరో నిఖిల్, మెగా కుటుంబ సభ్యులు తదితరులు హాజరయ్యారు.
TDP supremo Chandrababu Naidu sworn-in as Andhra Pradesh CM in presence of PM Modi
Read @ANI Story | https://t.co/zhYwNcOzSs#TDP #ChandrababuNaidu #AndhraPradesh #AndhraCM #PMModi pic.twitter.com/54RnxaBP56
— ANI Digital (@ani_digital) June 12, 2024