ఢిల్లీలో జరిగిన ఎన్డీయే కూటమి నేతల భేటీకి ఏపీకి కాబోయే సీఎం, టీడీపీ అధినతే నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ హాజరైన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో చంద్రబాబుకు మోడీ అత్యంత ప్రాధాన్యతనివ్వడం దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక, ఆ భేటీ ముగిసిన తర్వాత భేటీపై చంద్రబాబు స్పందించారు. ఎన్డీయే కూటమి సమావేశంలో పాల్గొన్నానని, ప్రజా తీర్పు ప్రకారం ఎన్డీయే కూటమి నాయకుడిగా నరేంద్ర మోడీని ఎన్డీయే భాగస్వామ్య పక్షాల నేతలందరం కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకున్నామని చంద్రబాబు తెలిపారు.
మోడీ నాయకత్వంలో భారత్ అభివృద్ధి పథంలో పయనించేలా, ప్రపంచానికే మార్గదర్శిలా ఎదిగేలా కూటమి నేతలంతా కలిసి కృషి చేస్తామని చంద్రబాబు తెలిపారు. ఇక, ఈ నెల 7న మరోసారి ఎన్డీయే సమావేశం నిర్వహించనున్నారు. ఈ నెల 9న ప్రధానిగా నరేంద్ర మోడీ మూడోసారి ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత ఈ నెల 12న ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అమరావతిలో చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమానికి ప్రధాని హోదాలో మోడీ కూడా హాజరయ్యే అవకాశాలున్నాయి.