పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు వ్యవహారంలో ఎన్నికల సంఘం పక్షపాతంతో వ్యవహరిస్తుందని ఏపీ హైకోర్టును వైసీపీ నేతలు ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే, ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాల్లో తాము జోక్యం చేసుకోలేమంటూ ఏపీ హైకోర్టు వైసీపీ వేసిన పిటిషన్ ను తిరస్కరించింది. పోస్టల్ బ్యాలెట్ ఓటర్ డిక్లరేషన్ కు సంబంధించిన ఫారం 13ఏ పై అటెస్టింగ్ అధికారి సంతకం ఉండి ఆ అధికారి పేరు, హోదా, అధికారిక ముద్ర లేకపోయినా ఆ ఓట్లు చెల్లుబాటు అవుతాయంటూ ఈసీ మే 30న ఆదేశాలు జారీ చేసింది.
దానిపై తాము జోక్యం చేసుకోలేమన్న ఏపీ హైకోర్టు….ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఎన్నికల పిటిషన్ దాఖలు చేయాలని సూచించింది. ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారంపై వైసీపీ నేతలు సుప్రీంకోర్టు తలుపు తట్టారు. అయితే, తాజాగా సుప్రీం కోర్టులో కూడా వైసీపీకి షాక్ తగిలింది. ఈసీ మార్గదర్శకాలను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో వైసీపీ దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు వైసీపీ నేతలకు షాక్ ఇచ్చింది. ఈ వ్యవహారంలో తాము జోక్యం చేసుకోలేమంటూ ఆ పిటిషన్ ను సుప్రీం తిరస్కరించింది. దీంతో, పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కు మరికొద్ది గంటల సమయం ఉన్న నేపథ్యంలో వైసీపీకి గట్టి షాక్ తగిలినట్లయింది. దీంతో, వైసీపీకి పోస్టల్ బ్యాలెట్ బుల్లెట్ దిగింది..అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.