ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో టీడీపీ కూటమి వర్సెస్ వైసీపీ ల మధ్య హోరా హోరీ పోరు సాగింది. ఎవరూ ఎక్కడా తగ్గకుండా ఒకరిపై ఒకరు ప్రచారం చేసుకున్నారు. విమర్శించుకున్నారు. దూషణలకు కూడా దిగారు. అయితే.. అధికార.. ప్రధాన ప్రతిపక్షాల మధ్య వివాదాలు.. విమర్శలు కామనే. అయితే.. ఎన్నడూ లేనిది..మరో కీలక విషయం కూడా తెరమీదికి వచ్చింది. అదే.. వైఎస్ వారసత్వం! దీనిని కాంగ్రెస్ పీసీసీ చీఫ్, సీఎం జగన్ సోదరి వైఎస్ షర్మిల ప్రస్తావించారు.
రాజన్న రాజ్యం తీసుకురాలేని.. జగన్ వైఎస్‌కు ఎలా వారసుడు అవుతాడని ఆమె నిలదీశారు. కడపలో వివేకా హత్య.. నిందుతల అంశాన్ని పదే పదే చెప్పిన షర్మిల.. ఇక్కడ వైసీపీ ఓటుబ్యాంకును చీల్చే ప్రయత్నం చేశారు. ఇక, ఉత్తరాంధ్రకు వెళ్లిన ఆమె ఇక్కడి వైఎస్ సానుభూతి పరుల మైండ్‌ను వాష్ చేసేశారు. నిజానికి అటు కడపలో వైఎస్ కుటుంబానికి సానుభూతి పరులు ఎక్కువ. దీంతో ఇక్కడ ఆమె సానుభూతి రాజకీయాలు చేశారు.
ఇక, ఉత్తరాంధ్రలో వైఎస్ అనుకూల ఓటు బ్యాంకు ఎక్కువగా ఉంది. దీంతో ఇక్కడ సహా.. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ వారసత్వాన్ని ప్రశ్నించారు. దీంతో తాజా ఏపీ ఎన్నికల్లో అసలు అప్పటి వరకు ఎవరూ స్పృశించని విధంగా వైఎస్ వారసత్వం తెరమీదికి వచ్చింది. తానేనిజమైన వారసురాలినని చివరి రెండు రోజుల ఎన్నికల ప్రచారంలోనూ షర్మిల వెల్లడించారు. కాంగ్రెస్‌ను వైఎస్ ఆరాధించారని.. రాహుల్‌ను ప్రధానిగా చూడాలని వైఎస్ కలలు కన్నారని.. కానీ, ఆ పార్టీతో విభేదించి, వైఎస్ చేసిన ఒక్క పనిచేయని జగన్ ఎలా వారసుడని కూడా నిలదీశారు.
దీంతో ఇప్పుడు కనుక జగన్ విజయందక్కించుకుని అధికారంలోకి రాకపోతే.. షర్మిల చెప్పిందే నిజం అవుతుంది. వైఎస్ వారసుడిగా ప్రజలు ఆయనను గుర్తించలేదనే భావించాల్సి ఉంటుంది. నిజానికి 2019లో జరిగిన ఎన్నికల్లోవైఎస్ వారసుడిగానే ప్రజలు గుర్తించి.. జగన్‌కు అవకాశం ఇచ్చారు.కానీ, ఇప్పుడు కనుక ఆయన ఓడిపోతే.. దీనిని పోగొట్టుకోవడంతోపాటు.. వైఎస్ వారసురాలిగా షర్మిలను ఆమోదించినట్టే అవుతుందని పరిశీలకులు చెబుతున్నారు.