భారత్ లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కరోనా ఫస్ట్ వేవ్ తో పోలిస్తే సెకండ్ వేవ్ లో రోజువారీ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. రోజుకు దాదాపు లక్షకు పైగా కేసులు నమోదు కావడం కలవరపెడుతోంది. దీంతోపాటు, మరణాల సంఖ్య కూడా గణనీయంగా పెరగడంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు కరోనా కాటు బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.
కరోనా సెకండ్ వేవ్ దృష్ట్యా సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. అంతేకాదు, దీంతో పాటుగా 12వ తరగతి పరీక్షలను వాయిదా వేస్తున్నామని సంచలన ప్రకటన చేసింది. ప్రధాని మోడీ ఆధ్వర్యంలో పరీక్షలపై ఉన్నత విద్యాశాఖ అధికారులతో అత్యున్నతస్థాయి సమీక్ష జరిగింది. ఈ సమీక్షలో వారితో చర్చించిన అనంతరం కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.
ఈ రోజు ఒక్కరోజే దేశంలో 1.85 లక్షలకు పైగా పాజిటివ్ కేసులు, 1026 మరణాలు నమోదయ్యాయి. అంతేకాదు, విద్యార్థులకు కరోనా వేగంగా సోకుతుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు కరోనా సెకండ్ వేవ్ ధాటికి ఇప్పటికే చాలామంది నేతలు, మంత్రులు, ముఖ్యమంత్రులు కరోనా బారిన పడ్డారు.
తాజాగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా కరోనా బారిన పడ్డారు. సీఎం యోగి ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. అంతకుముందు, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ ఆల్రెడీ కరోనా బారిన పడ్డ విషయం తెలిసిందే. దేశంలో కరోనా విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో కరోనా కేసులు పెరుగుతున్న పలు రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూలు, వీకెండ్ లాక్ డౌన్ లు, కఠిన ఆంక్షలు అమలవుతోన్న సంగతి తెలిసిందే.