ఏపీ సీఎం జగన్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడే అభివృద్ధి జరిగిందని, జగన్ అధికారంలోకి వచ్చాక అభివృద్ధి నిలిచిపోయిందని షా చెప్పారు. రూ.13.50 లక్షల కోట్ల అప్పును ప్రజల నెత్తిపై జగన్ రుద్దారని షా పేర్కొన్నారు. కూటమి అధికారంలోకి వస్తే అమరావతిని రాజధానిగా పునర్నిర్మిస్తామని షా హామీ ఇచ్చారు. అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి జగన్, రాహుల్ గాంధీలను ఆహ్వానించినా వారు రాలేదని చెప్పారు.
ఏపీలో అవినీతిపై పోరాటానికి మద్ధతు తెలిపేందుకే వచ్చానని, చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోదీ, పవన్ కల్యాణ్ చేతులు కలిపారని అన్నారు. బీజేపీ, తెలుగుదేశం, జనసేన ఏకమై రాష్ట్రంలో గూండాగిరిని, నేరస్థుల ఆటకట్టించేందుకు, అవినీతి పాలనకు ముగింపు పలికేందుకే పొత్తు పెట్టుకున్నాయని తెలిపారు. ‘‘ల్యాండ్ మాఫియా పీచమణచడానికి, అమరావతిని మళ్లీ ఆంధ్రప్రదేశ్ రాజధానిగా చేయడానికి పొత్తుపెట్టుకున్నాం. ..ఏడుకొండల వెంకటేశ్వర స్వామి పవిత్రతను పునఃస్థాపితం చేయడానికి పొత్తు పెట్టుకున్నాం…తెలుగు భాషను పరిరక్షించేందుకు పొత్తుపెట్టుకున్నాం. జగన్ రెడ్డీ… గుర్తుంచుకో… బీజేపీ ఉన్నంతకాలం తెలుగు భాషను అంతం కానివ్వం…’’ అంటూ షా విరుచుకుపడ్డారు.
ఏపీలో చంద్రబాబు, కేంద్రంలో మోదీ సర్కారు వస్తే రెండేళ్లలో పోలవరం పూర్తి చేస్తామని షా హామీనిచ్చారు. అవినీతిలో కూరుకుపోయిన జగన్ పోలవరం నిర్మాణాన్ని ఆలస్యం చేశారని షా ఆరోపించారు. 25కి 25 ఎంపీ స్థానాల్లో, అసెంబ్లీలో మూడింట రెండొంతుల సీట్లు ఇచ్చి చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయాలని, అపుడు డబుల్ ఇంజిన్ సర్కారు ఎలా పరుగులు తీస్తుందో మీరే చూస్తారు అంటూ ప్రజలకు పిలుపునిచ్చారు.