మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు…మచ్చుకైనా లేడు చూడు….మానవత్వం ఉన్నవాడు…అంటూ పాషాణ హృదయాలతో ఉన్న కరుడుగట్టిన మనుషుల గురించి గోరటి వెంకన్న ఆర్ధ్రతతో పాడిన పాట మనసున్న మనుషులందరనీ కదిలించింది. అయినప్పటికీ, మనుషుల రూపంలో ఉన్న కొందరు రాక్షసులు సాటి మనుషులను కసాయిల్లా మారి కడతేరుస్తున్నారు.
ఇక, మరికొందరైతే కళ్లముందే సాటి మనిషి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నా…మనకెందుకులే అని కళ్లు మూసుకొని చూసీచూడనట్లు పోతున్నారు. ఇక, పైశాచికత్వం పీక్స్ కు చేరిన మరికొందరైతే సాటి మనుషులు ఆత్మహత్య చేసుకుంటుంటే అడ్డుకోవాల్సింది పోయి….ఆ ఘటనను వీడియోగా చిత్రీకరిస్తూ పైశాచికానందం పొందుతున్నారు.
తాజాగా యూపీలో కోడలు ఉరి వేసుకుంటుంటే ఆ దృశ్యాలను ఆమె అత్తామామలు స్మార్ట్‌ఫోన్‌లో చిత్రీకరించిన ఉదంతం వినగానే ఒళ్లు గగుర్పాటుకు గురికాక మానదు. అంతేాకదు, ఉరి వేసుకుంటున్న కోడలిని ఆపాల్సిన అత్తామామలు…ఆ వీడియోను ఆన్ లైన్లో సైతం అప్ లోడ్ చేసి తమ పైశాచికత్వానికి హద్దుల్లేవని చాటారు.
అయితే, కోడలి ఆత్మహత్య ఉదంతంతో తమకు సంబంధం లేదని చెప్పేందుకు ఇలా వీడియో సాక్ష్యాన్ని రూపొందించామని వారు చెప్పడం ఈ ఉదంతానికే కొసమెరుపు. వారు చేసిన వెధవపనికి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. చివరకు ఆ అత్తామామలు కటకటాలు లెక్కబెడుుతన్నారు.
ఉత్తర ప్రదేశ్ లోని ముజఫర్ డాటియానా గ్రామంలో కోమల్ అనే అమ్మాయితో ఆశిష్ అనే అబ్బాయికి 2019లో వివాహం జరిగింది.
కోమల్ తల్లిదండ్రులు కట్నంగా ఐదు లక్షల నగదు, ఒక బైక్‌ని ఇచ్చారు. కానీ, అదనపు కట్నం కావాలని గత 6 నెలలుగా ఆశిష్ తల్లిదండ్రులు కోడలిని వేధిస్తున్నారు. దీంతో విసిగి వేసారిన కోమల్ ఇటీవల పుట్టింటికి వెళ్లిపోయింది. గ్రామ పెద్దలు పంచాయతీ పెట్టి నచ్చజెప్పడంతో తిరిగి అత్తవారింటికి వచ్చింది. అయితే, తిరిగి వచ్చిన కోమల్ కు అత్తమామలు, భర్త నుంచి తీవ్రస్థాయిలో వేధింపులు మొదలయ్యాయి.
దీంతో, వాటిని తాళలేక ఆమె గదిలోకి వెళ్లి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అయితే, కోడలిని ఆపకుండా, సాక్షం కింద పనికి వస్తుందని ఆ దృశ్యాలను కిటికీలో నుంచి అత్తామామలు చిత్రీకరించారు. వీరి అతి తెలివి తెల్లారడంతో పోలీసులు వారితో ఊచలు లెక్కబెట్టిస్తున్నారు.