టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోపై పవన్ కల్యాణ్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. యువగళం, జనగళంలో వచ్చిన వినతులు, బీజేపీ నేతల నుంచి వచ్చిన సలహాలు, సూచనలను పరిగణలోకి తీసుకొని మేనిఫెస్టోను రూపొందించామని అన్నారు. ఏపీ భవిష్యత్తు కత్తి మొన మీద వేలాడుతోందని, ఐదేళ్లుగా రాష్ట్రంలో అశాంతి, అరాచకం రాజ్యమేలుతున్నాయని దుయ్యబట్టారు. ఈ చేత్తో 10 రూపాయలిచ్చిన జగన్ ఆ చేత్తో 1000 కొల్లగొడుతున్నారని విమర్శించారు. అన్నా క్యాంటీన్లు మొందు టీడీపీ తెచ్చిన 100 సంక్షేమ పథకాలను జగన్ రద్దు చేశాడని మండిపడ్డారు.
13 లక్షల కోట్లు అప్పు చేసిన జగన్…ప్రతి కుటుంబంపై రూ. 8 లక్షల అప్పు భారం మోపాడని దుయ్యబట్టారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో లక్షలాది ఎకరాల ప్రజల ఆస్తిని కొల్లగొట్టేందుకు రెడీ అయ్యారని అన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ప్రతిపక్ష నేతలు 600 మందిని హత్య చేశారని, కానీ, వివేకా హత్య కేసు హంతకులను కాపాడుతున్నారని ఆరోపించారు. ఈ విధ్వంసకర పాలనకు చరమగీతం పాడేందుకు, స్వర్ణాంధ్రను నిర్మించేందుకు కూటమి అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలకు పవన్ పిలుపునిచ్చారు.