ఏపీలో జనసేన గాజు గ్లాస్ గుర్తును ఫ్రీ సింబల్ గా కేటాయించడంపై జనసేన నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్న 21 చోట్ల మాత్రమే కాకుండా చాలా చోట్ల స్వతంత్ర అభ్యర్థులకు కూడా గాజు గ్లాస్ గుర్తు కేటాయించింది ఎన్నికల సంఘం. అయితే, వైసీపీ వల్లే ఇలా జరిగిందని జనసేన నేతలు ఆరోపిస్తున్నారు. కుట్ర చేసి ఇలా తమ గుర్తును ఫ్రీ సింబల్ గా చేశారని ఆరోపిస్తున్నారు. ఇలా ఇండిపెండెంట్ లకు గ్లాస్ గుర్తు కేటాయించడం వల్ల ప్రజల్లో గందరగోళం ఏర్పడుతోందంటూ జనసేన పార్టీ ఏపీ హైకోర్టును ఆశ్రయించింది. టీడీపీ కూడా ఈ వ్యవహారంపై అనుబంధ పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ ను స్వీకరించిన హైకోర్టు విచారణను రేపటికి వాయిదా వేసింది.
కొన్ని వివాదాల్నిమొగ్గలోనే తుంచేయొచ్చు. కానీ.. అందుకు భిన్నంగా చోటు చేసుకునే పరిణామాలు చూస్తే.. ఇంత చిన్న విషయాల మీద ఎందుకు ఫోకస్ చేయరు? అన్నది ప్రశ్నగా మారుతుంటుంది. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి ఏపీ ఎన్నికల వేళ చోటు చేసుకుంది. జనసేనకు కేటాయించిన గాజు గ్లాస్ ను.. జనసేన పోటీ చేయని ప్రాంతాల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులకు కేటాయిస్తూ ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని పలువురు ప్రశ్నిస్తున్నారు.
జనసేన పార్టీ ఎన్నికల గుర్తుగా గాజు గ్లాస్ ఎంత ఫేమస్ అన్న విషయం తెలిసిందే. నిబంధనల ప్రకారం జనసేన పార్టీకి ఎన్నికల్లో రావాల్సిన ఓట్లు రాకపోవటంతో.. దాన్ని ఫ్రీ సింబల్ గా మార్చేయటం తెలిసిందే. తాజా ఎన్నికల్లో జనసేన అభ్యర్థులు పోటీ చేయని చోట్ల కూడా గాజు గ్లాస్ గుర్తును కేటాయించటం..ఈ గుర్తు కోసం పలువురు ఇండిపెండెంట్ అభ్యర్థులు పెద్ద ఎత్తున పోటీ పడటం తెలిసిందే.
నిజానికి ఎన్నికల సంఘం సిద్ధం చేసిన ఎన్నికల గుర్తుల్లో బోలెడన్న ఉన్నాయి. ఇలాంటివేళలో.. గాజు గ్లాస్ ను ఇండిపెండెంట్ అభ్యర్థులకు కేటాయించాల్సిన అవసరం లేదు. ఈ గుర్తును కేటాయించటం ద్వారా ఎన్నికల సందర్భంగా అనవసర లొల్లి తప్పించి మరేమీ ఉండదు. ఇలాంటప్పుడు పక్కాగా పుస్తకాల్లో పేర్కొన్నట్లుగా ఫాలో కాకుండా.. సంయమనంతో వ్యవహరిస్తే సరిపోతుంది. కానీ.. అందుకు భిన్నంగా గాజు గ్లాస్ ను పలువురు స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించిన వైనం ఇప్పుడు ఇబ్బందికరంగా మారిన పరిస్థితి.
గాజు గ్లాస్ ను ఎన్నికల సంఘం ఫ్రీ సింబల్స్ జాబితాలో పెట్టటం వెనుకపై కుట్ర కోణాన్ని తెర మీదకు తీసుకొస్తున్నారు. ఏపీలో ఎన్డీయే కూటమి ఓటర్లలో గందరగోళాన్ని క్రియేట్ చేసి.. ఓట్లు చీలేందుకు వీలుగా అధికారపక్షం వ్యవహరించిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకవేళ.. ఈ వాదనలోనే నిజం ఉందని అనుకుంటే.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో జట్టు కట్టిన జనసేనకు అలాంటి పరిస్థితి ఉంటుందా? తన మిత్రులతో కలిసి పవన్ కళ్యాణ్ కుట్రను అడ్డుకోలేరా? అన్న ప్రశ్న వినిపిస్తోంది. ఏమైనా.. స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తును కేటాయించటం ద్వారా కూటమికి ఇబ్బందులు తప్పవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.