ఆంధ్రప్రదేశ్ భూ యాజమాన్య చట్టం-2023 (ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్) ను ఏప్రిల్ 29 నుంచి జగన్ ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన 16 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సోమవారం నుంచి ఈ యాక్ట్ అమలు కానుంది. అయితే, భూ హక్కు చట్టంపై టీడీపీ నేతలు, ప్రతిపక్ష నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇక, పొలం పట్టాదారు పుస్తకాలపై ప్రభుత్వ రాజముద్రతోపాటు జగన్ ఫొటో కూడా ముద్రించడంపై విపక్ష నేతలు మండిపడుతున్నారు. ప్రజల భూములు కొట్టేసేందుకు భూ హక్కు చట్టం పేరుతో జగన్ రెడ్డి కుట్రలు చేస్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమ విమర్శించారు.
ఈ చట్టం అమలుతో రాష్ట్రంలో ప్రజల ఆస్తులు ప్రమాదంలో పడ్డాయని హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా టైటిల్ పేరిట జగన్ ప్రభుత్వం ప్రజలను వంచన చేస్తోందని విమర్శించారు. ఈ చట్టం రాష్ట్రవ్యాప్తంగా అమలైతే ప్రజల హక్కులను హరించడమే కాకుండా న్యాయం కోరే అవకాశం కూడా ఉండదని వార్నింగ్ ఇచ్చారు.. ప్రజల వ్యక్తిగత ఆస్తులపై మీ పెత్తనం ఏంటి? అంటూ ఉమ మండిపడ్డారు. భూభక్ష పథకంతో వైఎస్ జగన్.. సామాన్యుడిని సర్వం దోచేస్తాడంటూ జగన్ పై ఫైర్ అయ్యారు.
అయితే, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రాష్ట్రంలో అమలు చేయబోమని రెవెన్యూ, స్టాంప్ లు, రిజిస్ట్రేషన్ శాఖల మంత్రి ధర్మాన ప్రసాదరావు అంటున్నారు. ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం అని, న్యాయపరంగా క్లియరెన్స్ వచ్చాక మిగతా రాష్ట్రాలు ఎలా అమలు చేస్తాయో ఏపీలో కూడా అదే విధంగా అమలు చేస్తామని, వివరించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై విపక్ష నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. వందేళ్ల తర్వాత ఏపీలో భూ సర్వే చేపట్టిన ప్రభుత్వం తమదేని అన్నారు. ఈ చట్టంతో పేదల భూమిని జగన్ లాక్కుంటాడని ఆరోపించడం దుర్మార్గమని అన్నారు.
ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్- 2022 ప్రకారం ఆస్తి సర్వే చేసి ఎవరి పేరు మీద నమోదు చేస్తారో వారిదే స్థలం, ఇల్లు, పొలం, గట్రా. ఇలా నమోదైన భూములపై వివాదం నెలకొంటే వీఆర్ వో నుంచి సివిల్ కోర్టుల దాకా ఎవరూ జోక్యం చేసుకునే వీలులేదు. సివిల్ కోర్టులో దావా వేసే వీలుండదు. వీటికి సంబంధించిన వివాదాలను పరిష్కరించే బాధ్యత టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ దే.. ఈ తీర్పు నచ్చకపోతే ల్యాండ్ టైటిలింగ్ అప్పీలేట్ ఆఫీసర్ దగ్గరకు వెళ్లే అవకాశం ఉంటుంది. అక్కడా న్యాయం జరగలేదని భావిస్తే ఇక నేరుగా హైకోర్టును ఆశ్రయించాల్సిందే.