రోటీన్ కు భిన్నమైన పరిస్థితులు.. పరిణామాలు ఐటీ రంగంలో చోటు చేసుకుంటున్నాయి. సాధారణంగా రంగం ఏదైనా అందులో పని చేసే ఉద్యోగుల సంఖ్య పెరగటమే కానీ తగ్గటం ఉండదు. అందుకు భిన్నంగా ఐటీ రంగంలో పరిస్థితులు నెలకొన్నాయి. అందుబాటులోకి వస్తున్న అత్యాధునిక సాంకేతికత పుణ్యమా అని ఐటీ రంగంలో రోజులు గడిచే కొద్దీ ఉద్యోగాలు తగ్గటమే కానీ పెరగని పరిస్థితి. గత ఏడాది విషయానికి వస్తే దేశంలో ఒక్క హెచ్ సీఎల్ టెక్నాలజీస్ మినహాయిస్తే మిగిలిన ప్రధాన ఐటీ కంపెనీల్లో తగ్గుదలే కనిపిస్తోంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 69వేల వరకు ఉద్యోగుల సంఖ్య తగ్గినట్లుగా గుర్తించారు.
ఇటీవల కాలంలో ఐటీ కంపెనీలు తమ క్వార్టర్ (త్రైమాసిక) ఫలితాల్ని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయా కంపెనీల్లో పని చేసే ఉద్యోగుల సంఖ్య లెక్కల్ని బయటపెట్టగా.. తాజా అంశాన్ని గుర్తించారు. దేశీయ ఐటీరంగంలో దిగ్గజ సంస్థలుగా పేరున్న టీసీఎస్ (టాటా టెక్నాలజీస్ సర్వీసెస్).. ఇన్ఫోసిస్.. హెచ్ సీఎల్ (హెచ్ సీఎల్ టెక్నాలజీస్).. విప్రో.. మహీంద్రా.. ఇటీవల తమ క్వార్టర్ ఫలితాల్ని వెల్లడించాయి. ఈ సందర్భంగా తమకు వచ్చిన ఆదాయాల్ని.. ఖర్చు లెక్కల్ని వెల్లడించాయి. త్రైమాసిక ఫలితాల్లో సంస్థ లాభ నష్టాలతో పాటు.. ఉద్యోగుల సంఖ్యపైనా క్లారిటీ ఇచ్చారు.
నాలుగు దిగ్గజ ఐటీ కంపెనీల్లో మొత్తం 69,167 మంది తగ్గినట్లుగా తేల్చారు. ఇందులో విప్రో సంస్థలో భారీ ఎత్తున ఉద్యోగుల సంఖ్య తగ్గింది. ఇన్ఫోసిస్ లో 25,994 .. టీసీఎస్ లో 24,516 మంది.. టీసీఎస్ లో 13,249.. మహీంద్రాలో 6,945 మేర ఉద్యోగుల తగ్గుదల నమోదైంది. ఒక్క హెచ్ సీఎల్ లో మాత్రమే 1537 మంది ఉద్యోగుల సంఖ్య పెరిగింది. అంటే.. దేశీయ ఐదు దిగ్గజ ఐటీ కంపెనల్లో ఒక్క హెచ్ సీఎల్ మినహాయిస్తే మిగిలిన అన్నీ ఐటీ కంపెనీల్లో ఉద్యోగుల సంఖ్య తగ్గిన వైనం టెన్షన్ పుట్టించేలా మారిందని చెప్పాలి.