‘’ఈసారి ఎన్నికలలో నేను 5 నుండి 7 లక్షల ఓట్ల మెజారిటీ తో గెలుస్తున్నాను. గత పదేళ్లలో నేను చేసిన అభివృద్ది, మోడీ – యోగీ ఫ్యాక్టర్ నా ఘనవిజయానికి దోహదం చేస్తున్నాయి’’ బాలీవుడ్ సీనియర్ నటి, డ్రీమ్ గర్ల్, మథుర సిట్టింగ్ ఎంపీ హేమమాలిని అన్నారు. రెండో విడతలో పోలింగ్ జరుగుతున్న 13 రాష్ట్రాలలోని 88 స్థానాల్లో ఉత్తరప్రదేశ్ లోని మథుర కూడా ఉంది.
బీజేపీ నుండి హేమమాలిని పోటీ చేస్తుండగా, కాంగ్రెస్ నుండి ముఖేష్ దంగర్ పోటీ చేస్తున్నాడు. ఈ ఎన్నికలలో రాష్ట్రీయ లోక్ దళ్ (ఆర్ఎల్డీ) పొత్తు కలిసి వచ్చిందని, చేసిన అభివృద్దితో పాటు, కార్యకర్తలు బాగా పనిచేశారని, అందుకే విజయంపై సంపూర్ణ నమ్మకం ఉందని హేమమాలిని అన్నారు.
2014లో తొలిసారి పోటీ చేసిన హేమమాలిని ఆర్ఎల్డీ అభ్యర్థి జయంతి చౌదరిపై ఏకంగా 3,30,743 భారీ మెజారిటీతో విజయం సాధించింది. 2019 ఎన్నికలలో ఇదే నియోజకవర్గం నుండి ఆర్ఎల్డీ అభ్యర్థి 2,93,471 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. అయితే ఈసారి ఆర్ఎల్డీ బీజేపికి మద్దతు నేపథ్యంలోనే డ్రీమ్ గర్ల్ హేమమాలిని 5 నుండి 7 లక్షల భారీ ఆధిక్యంతో గెలుస్తానని ధీమాగా చెబుతున్నారు.
ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్, ఎస్పీ పార్టీల ప్రభావం నామమాత్రమే. 2019లో కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ 28 వేల ఓట్లు రాగా, 2014లో ఎస్పీకి ఇక్కడ 36,673 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈ లెక్కన డ్రీమ్ గర్ల్ గెలుపు నల్లేరు మీద నడకే అని చెప్పాలి.