సార్వత్రిక ఎన్నికల బరిలోకి దిగుతున్నారు అన్నాచెల్లెళ్లు. దేశంలోనే అత్యధిక లోక్ సభ స్థానాలున్న యూపీలో బీజేపీ సీట్లకు గండి కొట్టేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నాయి రాజకీయ పార్టీలు. ఇందుకు కాంగ్రెస్ మినహాయింపు కాదు. తాజా ఎన్నికల్లో అమేఠీ నుంచి రాహుల్ గాంధీ.. రాయ్ బరేలీ నుంచి ప్రియాంక వాద్రా నిలవాలని భావిస్తున్నారు. ఇందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్ తనకు బలమైన రాష్ట్రంగా భావిస్తున్న బీజేపీకి గట్టి సవాలు విసిరే వ్యూహంలో భాగంగా రాహుల్.. ప్రియాంకలు ఇద్దరు ఎన్నికల బరిలోకి రావాలని డిసైడ్ అయ్యారు.
దీనికి సంబంధించి ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లుగా చెబుతున్నారు. అంతేకాదు.. రాముడు కేవలం బీజేపీ వారి సొత్తు కాదన్న విషయాన్ని తమ చేష్టల ద్వారా దేశ ప్రజలకు చాటి చెప్పేందుకు వీలుగా.. అన్నాచెల్లెళ్లు ఇద్దరు తమ నామినేషన్ సందర్భంగా అయోధ్య బాలరాముడ్ని దర్శనం చేసుకోనున్నట్లుగా తెలుస్తోంది. అయోధ్యలో రామాలయం నిర్మితమైన తర్వాత ఇప్పటివరకు కాంగ్రెస్ అగ్రనాయకత్వం అయోధ్యలోని రాములోరి గుడికి వచ్చి దర్శనం చేసుకున్నది లేదు. అయోధ్యలో రామాలయం అన్నది శతాబ్దాల హిందువుల కల.
దాన్ని సాకారం చేసిన మోడీ సర్కారుకు మైలేజీ దక్కకూడదన్న ఉద్దేశంతో అయోధ్య రాములోరిని ఇంతవరకు దర్శించుకోని అన్నాచెల్లెళ్లు.. ఇప్పుడు అందుకు భిన్నంగా స్వామి దర్శనం కోసం ప్లాన్ చేసుకోవటం ఆసక్తికరంగా మారింది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా విడుదల కాలేదు. వచ్చే వారంలో దీనికి సంబంధించిన ప్రకటన వెలువడుతుందని చెబుతున్నారు. మే 20న అమేఠీ.. రాయ్ బరేలీ ఎంపీ స్థానాల్లో పోలింగ్ జరగనుంది. నామినేషన్ కార్యక్రమంలో అయోధ్య బాలరాముడ్ని దర్శించుకోవటం ద్వారా.. ఇంతకాలం అయోధ్య ఆలయానికి రాలేదన్న అపప్రభ ఎదుర్కోవటానికే ఇలా చేస్తున్నారని చెబుతున్నారు.
కీలకమైన ఎన్నికల వేళలో స్వామిని దర్శించుకునే కన్నా.. ముందే ఆ పని చేస్తే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ కు కంచుకోటలా ఉండే అమేఠీ.. రాయ్ బరేలీ స్థానాలనుంచి పోటీ చేయటం ద్వారా సురక్షితంగా ఉండొచ్చన్నది ఆలోచనగా చెబుతున్నారు. తాము బరిలోకి నిలవటం ద్వారా బీజేపీకి వచ్చే సీట్ల మీద ప్రభావం చూపే వీలుందని అంచనా వేస్తున్నారు. మరి.. ఓటర్ల తీర్పు ఏ రీతిలో ఉంటుందో చూడాలి.