నామినేషన్ల పర్వం ప్రారంభమై..మూడు రోజులు అయిపోయినా..కూడా టీడీపీలో అభ్యర్థుల మార్పు జరుగుతూనే ఉంది. ఇది క్షేత్రస్థాయిలో ఆ పార్టీపై ప్రభావం చూపించే అవకాశం ఉందని సీనియర్ నాయకులు భావిస్తున్నారు. అయితే.. పొత్తులో భాగంగా కొందరికి కేటాయించిన సీట్లు మార్చక తప్పడం లేదన్నది మరికొందరి వాదన. తాజాగా జరిగిన మార్పులు గమనిస్తే.. ఉండి అసెంబ్లీ స్థానాన్ని ఎంపీ రఘురామకృష్ణ రాజుకు కేటాయించారు.
వాస్తవానికి ఇక్కడ తొలిజాబితాలోనే సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజుకు టికెట్ ఇచ్చారు. అయితే.. రఘురామకు న్యాయం చేయాలన్న సంకల్పంతో ఇక్కడ సీటును మార్చేశారు. కానీ, దీంతో ఇక్కడ మంతెన రామరాజు, శివ అన్నదమ్ముల మధ్య గొడవలను ఈ మార్పుతో చల్లార్చినట్టయ్యింది. ఇక, మడకశిర ఎస్సీ అసెంబ్లీ స్థానాన్ని కూడా మార్పులు చేశారు. టీడీపీ ఎస్సీ సెల్ నాయకుడు.. ఎం.ఎస్.రాజుకు ఈ టికెట్‌ను కేటాయించారు. వాస్తవానికి ఇప్పటికే ఈ టికెట్‌ను వేరేవారికి కేటాయించి.. ఇప్పుడు మార్చారు. రాజు చాలాకాలంగా పార్టీలో కీలకంగా ఉన్నారు. ఆయనను పక్కన పెట్టడం అప్పట్లో అందరినీ ఆశ్చర్యపరిచింది. తాజాగా అతనికి గౌరవం దక్కడం ఎస్సీ వర్గాలకు మాత్రమే కాకుండా టీడీపీలో నమ్ముకున్న వారికి అన్యాయం జరగదని రుజువైంది.
ఇక, ఎస్టీ నియోజకవర్గం పాడేరులోనూ టీడీపీ మార్పులు చేసింది. మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికి ఈ టికెట్ తాజాగా ప్రకటించింది. వాస్తవానికి తొలి జాబితాలోనే ఈ టికెట్‌ను మాజీ ప్రభుత్వ ఉపాధ్యాయుడు వెంకట రమేష్‌కు కేటాయించారు. అయితే..ఇక్కడ వివాదాలు చెలరేగడం, ఈశ్వరి గట్టిగా పోరాటం చేయడంతో ఇప్పుడు ఆమెకే టికెట్ ఇస్తున్నారు. అయితే.. ఇక్కడ కూడా పలు నియోజకవర్గాల్లోమాదిరిగా.. అసంతృప్తుల బెడద కొనసాగడం గమనార్హం. మొత్తానికి మార్పు జరిగింది.. కానీ, ఓటు బ్యాంకు ఎలా సాధిస్తారనేది చూడాలి.