ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా సజ్జల రామకృష్ణారెడ్డి తగ్గేదేలే అన్నట్లు సాగుతున్నారు. ఎన్నికల సంఘం చెప్పినా వినేదేలేదనే విధంగా ఆయన తీరు ఉందనే విమర్శలు వస్తున్నాయి. ఏపీలో ప్రభుత్వ సలహాదారులకు కూడా ఎన్నికల కోడ్ వర్తిస్తుందని ఎన్నికల సంఘం ప్రకటించింది. కానీ చెప్పింది తనకు కాదనే ధోరణిలో సజ్జల ఉన్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ప్రభుత్వ సలహాదారుగా సజ్జల రాజకీయ వ్యవహారాలు మాట్లాడకూడదు. కానీ ఆయన యథేచ్ఛగా మీడియా సమావేశాలు పెడుతూ పొలిటికల్ వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. టీడీపీపై, కూటమిపై విషం చిమ్ముతూనే ఉన్నారనే విమర్శలు వస్తున్నాయి.
అయినా సజ్జల లెక్క చేయడం లేదనే టాక్ ఉంది. ఇప్పటికే మహిళా కమిషన్ ఛైర్పర్సన్ వాసిరెడ్డి పద్మతో రాజీనామా చేయించారు. సజ్జల కూడా నిబంధనల ప్రకారం రాజకీయాలు మాట్లాడాలి అనుకుంటే రాజీనామా చేయాల్సిందే. కానీ ఆయన చేయరనే చెప్పాలి. ఎందుకంటే పేరుకు మాత్రమే ఆయన సలహాదారు కానీ వైసీపీ ప్రభుత్వంలో కీలక బాధ్యతలన్నీ ఆయనవే అనడంలో సందేహం లేదు. అందుకే సజ్జల షాడో సీఎం అంటూ ప్రత్యర్థి పార్టీలు విమర్శిస్తూనే ఉంటాయి. ప్రస్తుతం జగన్ బస్సు యాత్ర చేస్తుంటే మిగతా వ్యవహారాలన్నింటికీ సజ్జలనే చక్కబెడుతున్నారని టాక్.
ఇక జగన్‌పై జరిగిన గులకరాయి దాడిని మరో లెవల్‌కు తీసుకెళ్లేందుకు సజ్జలనే వ్యూహాలు రచిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ప్రభుత్వంలోని కీలక విభాగాలను తన గుప్పిట్లో పెట్టుకుని ఆడిస్తున్నారని సజ్జలపై విమర్శలున్నాయి. అందుకే ఇప్పుడు రాజీనామా చేస్తే యంత్రాంగంపై గ్రిప్ పోతుందని, అది పార్టీకి నష్టం చేస్తుందని సజ్జల భావిస్తున్నట్లు సమాచారం. అందుకే సలహాదారుగా కొనసాగుతూనే తెర వెనుక పనులు చేస్తూనే ఉంటారని సజ్జలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.