ఏపీలో ఎన్నికల కోడ్ నేపథ్యంలో వాలంటీర్లను కొన్ని విధుల నుంచి తప్పిస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఏపీలో ప్రభుత్వ సలహాదారులకు కూడా ఈసీ షాకిచ్చింది. వారిపై ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో వారికి కూడా ఎన్నికల కోడ్ వర్తిస్తుందని తాజా స్పష్టం చేసింది. ప్రభుత్వ జీతభత్యాలు పొందుతున్న 40 మందికి కోడ్ వర్తిస్తుందని ఈసీ ఆదేశాలు జారీ చేసింది.
నిర్దేశించిన విధులకు బదులుగా రాజకీయ జోక్యం చేసుకుంటున్నట్టు ప్రభుత్వ సలహాదారులపై ఈసీకి ఫిర్యాదులు అందడంతో ఈసీ చర్యలు తీసుకుంది. ప్రతిపక్షాలను విమర్శిస్తూ మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నట్టు ఆ ఫిర్యాదుల్లో పేర్కొనడంతో ఈసీ స్పందించింది. ఆ ఫిర్యాదులను పరిశీలించిన కేంద్ర ఎన్నికల సంఘం కోడ్ ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చింది. ఇటీవల ఏపీ ప్రభుత్వ సలహాదారు, సకల శాఖా మంత్రి సజ్జల ప్రెస్ మీట్ పెట్టి విమర్శలు చేయడంతో ఈసీకి ఫిర్యాదులు అందాయని తెలుస్తోంది.