ఏపీలో సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత లా అండ్ ఆర్డర్ గాడి తప్పిందని, పోలీసులు ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు పలుమార్లు విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఏపీలో రాజారెడ్డి రాజ్యాంగం, పులివెందుల పంచాయతీలు ఎక్కువయ్యాయని, జగన్ హయాంలో టీడీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు పెరిగిపోయాయని, రాష్ట్రంలో శాంతిభద్రతలను పరిరక్షించాలని డీజీపీ సవాంగ్ కు చంద్రబాబు పలుమార్లు లేఖలు రాసినా ఫలితం శూన్యం.
ఈ నేపథ్యంలోనే ఏకంగా ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు రోడ్ షోలో స్వయంగా చంద్రబాబుపైకి రాళ్లు విసిరిన ఘటన రాజకీయ దుమారం రేపింది. తిరుపతిలోని గాంధీ రోడ్డులో చంద్రబాబు ప్రచార సభ నిర్వహిస్తుండగా గుర్తు తెలియని దుండగులు రాళ్లు రువ్వడం కలకలం రేపింది. ఈ ఘటనలో ఒక మహిళతో పాటు, ఓ యువకుడికి గాయాలవడంతో చంద్రబాబు మండిపడ్డారు. ఈ ఘటనపై అదనపు ఎస్పీకి ఫిర్యాదు చేసిన చంద్రబాబు…అక్కడే రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.
జడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉన్న తనకే రక్షణ లేకపోతే…జగన్ పాలనలో సామాన్యుల పరిస్థితి ఏమిటని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. చంద్రబాబు బస చేస్తున్న బస్సు దగ్గరకు వచ్చిన పోలీసులు దాడి ఘటనపై భద్రతా సిబ్బందిని ప్రశ్నించారు. రాళ్లు వేసిన వారిని గుర్తించగలరేమో అని అడిగి తెలుసుకున్నారు.
మరోవైపు, ఈ ఘటనపై రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కు ఫిర్యాదు చేసేందుకు టీడీపీ నేతలు అపాయింట్ మెంట్ కోరారు. గవర్నర్ కు నిన్న రాత్రే ఈ ఘటనపై టీడీపీ నేత వర్ల రామయ్య లేఖ రాశారు. విచారణలో దాడికి యత్నించిన దుండగులెవన్నది తేలాల్సి ఉంది.